రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

C

– ఒకేదఫా రుణమాఫీ, రాష్ట్ర ఆవిర్బావం నుంచి పరిహారం చెల్లించాలని ప్రతిపాదన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి):

రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఒకే దఫారుణ మాఫీ ,రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పెంచిన నష్ట పరిహరం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు. సభలో చర్చను ప్రారంభిస్తు మంత్రి పోచారం  వరుసగా రెండేళ్ల అనావృష్టితోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇక రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని కోరారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ కింద ఎనిమిదివేల కోట్లకు పైబడి నిధులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. రుణమాఫీని మొత్తంగా మాఫీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. అంతకు ముందు విపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు విూరు కారణం విూరు కారణం అని విమర్శించుకోవడం కాకుండా అర్ధవంతమైన చర్చ జరగాలని సూచించగా, ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడుతూ విలువైన సలహాలు ఇవ్వాలని అందరిని కోరుతున్నానన్నారు. రైతు సమస్యలపై అందరూ సమగ్రంగా చర్చించి పరిస్కారం ఆలోచిద్దామని

అన్నారు. అంతకుముందు మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్షాలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. సభలో రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. అయితే చర్చకు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో హరీష్‌రావు కల్పించుకుని రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆరే నేరుగా చర్చ చేపట్టాలని నిర్ణయిస్తే ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులపై ప్రతిపక్షాలకు నిజంగా ప్రేమ ఉంటే రైతు సమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చర్చకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ.. మొదటగా రైతు సమస్యలపై చర్చించుకుందాం. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దానికనుగుణంగానే రైతు సమస్యలపై చర్చ ప్రారంభించాం. నిందారోపణలు అనవసరం. వివరణాత్మకమైన చర్చ అవసరం. అన్ని సమస్యల విూద మాట్లాడుకుందాం. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి. ఉత్తమమైన సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని సీఎం తెలిపారు.