రైతు సంక్షేమం మరిచిన ప్రభుత్వం
ఖమ్మం, జూలై 17 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమం పట్ట కుండా కుర్చీలు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుర్చీ కాపాడుకోవడంలో, పార్టీలోని అంతర్గత గొడవలు సర్దుబాటు చేయడంలో చూపుతున్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై చూపడం లేదని వారు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలివేశారని విమర్శించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం రైతు ఆరుగాలం పండించిన పంటకు ధర నిర్ణయించలేకపోయిందన్నారు. మద్దతు ధర, పంటల రుణాలు, సాగునీరు, పెరిగిన ఎరువుల ధరలతో అన్నదాత రైతన్న కష్టాలపాలయ్యారని అన్నారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ నాయకులు ధనయజ్ఞం చేస్తూ వేలకోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శించారు. కేంద్ర సరళికృత వాణిజ్య విధానాలతో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. వ్యవసాయానికి 9 గంటలు నిరంతరం ఉచిత విద్యుత్ అందించారని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని లేనిచో టిడిపి తరఫున ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.