రైతు సమస్యలు తీరలేదు
నిజామాబాద్,డిసెంబర్18(జనంసాక్షి): నోట్ల రద్దు, జిఎస్టీ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని దుస్థతిలో పాలకులు ఉన్నారని కాంగ్రెస్ జిల్లా నేత తాహిర్ బిన్ హుదాన్ అన్నారు. రిజర్వ్‌బ్యాంకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు అప్పుల బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి దీర్ఘకాలిక రుణాలు అందించాలని కోరారు. రుణమాఫీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అవసరం ఉన్న ప్రతి రైతుకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల సౌకర్యం లేక బోరుబావులపై ఆధారపడి, సాగుచేస్తున్న రైతులు రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి, ప్రైవేటు అప్పులపాలై అధికవడ్డీలు చెల్లించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 20 ఏళ్లల్లో పాలకులు, బ్యాంకింగ్ వ్యవస్థల రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయరంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు.ఇదిలావుంటే తెలంగాణ ఏర్పడి ఐదేళ్లు దాటినా నిజాం షుగర్స్ తెరవకపోవడం దారుణమని అన్నారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కుతూ దీనిని పట్టించుకోవడం లేదన్నారు. నిజాం షుగర్స్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. వంద రోజుల్లో పరిశ్రమను స్వాధీనం చేసుకుంటామని ఇచ్చిన హావిూని అమలు చేయాలని డిమాండు చేశారు. ఇక్కడి రైతులు, కార్మికుల ప్రయోజనాలను గుర్తించి పరిశ్రమను తెరిపించేలా చేయాలన్నారు.