రోడ్డున పడుతున్న ఉద్యోగులు
ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశంలోనిరుద్యోగ సమస్యతీవ్ర రూపం దాల్చే ప్రమాదం ముంచు కొస్తోంది. కొత్తగా ఉద్యోగాల సృష్టి అన్నది మిథ్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల సంగతెలా ఉన్నా ప్రైవేట్రంగంలోనూ మాంద్యంప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఉన్నపళంగా ఉద్యోగాలను ఊడబెరి కేస్తున్నారు. దీంతో వేలాదిమంది నిరుద్యోగులుగా రోడ్డున పడుతున్నారు. ఉన్ననిరుద్యోగులకు తోడు వీరుకూడా రోడ్డున పడడంతో తీవ్ర అనిశ్చితికి దారితీసే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై తక్షణం చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ప్రధానంగా ఇప్పుడీ సమస్యపై దృష్టి సారించాలి. మాంద్యం నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం పీకల్లోతు సంక్షోభంలో చిక్కుకుంది. కార్ల అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ ఒక్క రంగంలోనే మూడున్నర లక్షల మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. పార్లే బిస్కెట్ కంపెనీ యాజమాన్యం సంక్షోభాన్ని సాకుగా చూపి పది వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. రక్షణరంగం ప్రైవేటీకరణ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న 82వేల మంది రెగ్యులర్ ఉద్యోగులను, మరో 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీవ్ర అభద్రతలోకి నెట్టింది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి నిరుద్యోగం పెరగడానికి ఈ విధానాలే కారణం. నిరుద్యోగం ఉగ్ర రూపం దాల్చితే జరిగే పరిణామం ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గడం వల్ల మార్కెట్లో సరుకులకు గిరాకీ పడిపోతున్నది. డిమాండ్ తగ్గినప్పుడు సరుకుల ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్యాక్టరీల మూసి వేతకు దారితీస్తుంది. దీనివల్ల మరింత మంది ఉపాధి కోల్పోయి వీధిన పడతారు. ఇదంతా ఒక విషవల యంగా మారుతోంది. ఇప్పటికే 9 శాతానికి చేరుకున్న నిరుద్యోగిత రేటుకు ప్రస్తుత విధానాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. 33 శాతానికిపైగా ఉన్న యువత ఉపాధి లేమితో ఇబ్బంది పడుతున్నది. నిజ వేతనాలు పడిపోతున్నాయి. అంబానీ,ఆదానీల ఆస్తులు మాత్రం వందల రెట్లు పెరుగుతున్నాయి. ఇంకో వైపు 66 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే రైతుల పండించే పంటకు కనీస మద్దతు ధర ప్రకటించ కుండా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోంది. గ్రావిూణులకు ఎంతో కొంత ఆసరాగా ఉండే జాతీయ ఉపాధి హావిూ పథకాన్ని నీరుగార్చడంతో గ్రావిూణ నిరుద్యోగం కూడా తీవ్ర రూపం దాల్చుతున్నది. ప్రభుత్వాలలు వీటిపై దృష్టి పెట్టడానికి బదులు కార్పొరేట్లకు లాభాలు పెంచే చర్యలు చేపడుతున్నాయి. జబ్బు ఒకటి అయితే మందు మరొకటి అన్న చందంగా చర్యలు ఉంటున్నాయి. ప్రజల్లో కొనుగోలుశక్తి పెంచడానికి చర్యలు చేపట్టకుండా బడా వ్యాపారులకు మరిన్ని రుణాలు ఇస్తున్నది. వీరంతా ఇప్పటికే భారీగా బ్యాంకుల నుండి రుణాలను పొం, తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టడంతో బ్యాంకులు కూడా తీవ్రనష్టాల్లో ఉన్నాయి. ఎన్‌పిఎలు పెరిగి పోతున్నాయి. బ్యాంకుల విలీనం, అంకుర సంస్థలపై ఏంజెల్ టాక్స్ రద్దు, బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు, రెపోరేటు కుదింపు, జిఎస్‌టి రాయితీలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులపై సర్ ఛార్జి రద్దు వంటి పలు ఉద్దీపనలు ఇప్పటికే ప్రకటించింది. మరి కొన్ని ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. దీనికితోడు గ్రావిూణ ఆర్థిక వ్యవస్త కోలుకోలేని విధంగా తయారయ్యింది. చేతివృత్తులకు ప్రోత్సాహం కరువయ్యింది. ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు సెలవిచ్చినదాని ప్రకారం చూస్తే వాస్తవ వృద్ధి రేటు ఇంకా దిగజారి ఉంటుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి అంకెలను మతలబు చేసి వృద్ధి రేటు 7 శాతం దాకా ఉన్నట్లు చూపిస్తూ వచ్చారని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణ్యం, ఆర్‌బిఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్ వంటివారు ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తూ వస్తున్న నయా ఉదారవాద విధానాలకు తోడు మోడీ ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి మతిమాలిన చర్యల వల్ల దేశం నేడు అసాధారణ మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఉత్పాదక రంగం వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. దేశీయ, విదేశీ రుణభారాన్ని విపరీతంగా పెంచేసింది. విమానాలు, రైల్వేలు, చమురు, గ్యాస్ వంటి సహజవరులను ప్రైవేట్ పరం అవుతున్నా ఉద్యోగాల భర్తీ పెరగడం లేదు. మరో వైపు కార్మిక హక్కులపై ఎడా పెడా దాడులకు దిగుతున్నది. అనర్థాలకు మూలమైన విధానాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో పెద్దగా ఊరడింపు దక్కలేదు. దేశాన్ని వణికిస్తున్న మాంద్యాన్ని అది ఏమాత్రం పరిష్కరించజాలదు. 2008లో వచ్చిన మాదిరిగా మరో సారి ప్రపంచ వ్యాపిత్తంగా మాంద్యం ముంచుకొస్తే మళ్లీ తట్టుకుని నిలవడానికి లేని స్థితికి మన ఆర్థిక వ్యవస్థను ముంచుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలో కూరుకుపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆర్థిక పతనం అసంఖ్యాక శ్రామిక వర్గ ప్రజానీకం జీవితాలపై తీవ్ర దుష్పభ్రావం చూపుతుంది. ఐఎంఎఫ్, ఇతర ఆర్థిక సంస్థలు హెచ్చరించినట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తైమ్రాసికంలో వృద్ధి రేటు ఒక్కసారిగా 5 శాతానికి పడిపోయింది. ఈ దశలో నిరుద్యోగం పెరగక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే దేశంలో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంది.