రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

– ట్రాక్టర్ ను ఢీ కొట్టిన డీసీఎం.
-ఊరుకొండలో విషాదఛాయలు
– చనిపోయిన ఇద్దరు తల్లికి ఒక్కొక్కరే.
– ఒకరిది వెంకటాపూర్…మరొకరిది రాణిపేట్.
– బతుకుదెరువు కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో బలయ్యారు.
– రాజేష్ కు ముగ్గురు ఆడపిల్లలే.
– బాధిత కుటుంబ సభ్యుల కన్నీటి రోదన.
– డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ప్రమాదం.
ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన రాజేష్(30) గత 15 సంవత్సరాల క్రితం కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి బతుకుదెరువు కోసం ఊరుకొండ మండల కేంద్రానికి వచ్చి ఇక్కడే వివాహం చేసుకొని, స్థిరపడి సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. రాజేష్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. రాజేష్ కు భార్య బంగారమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఊరుకొండ గుట్ట నుండి ట్రాక్టర్ లో కడీలు నింపుకొని ఖాళీ చేసేందుకు బయలుదేరి వెళ్తుండగా దిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ వెనక నుండి వస్తున్న డీసీఎం ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ పై ఉన్న సూర్యకిరణ్ తోపాటు ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్ ట్రాక్టర్ బోల్తా పడి… కడీలు విరిగి పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ పై ఉన్న సూర్య కిరణ్ (20) తీవ్ర గాయాల పాలై కొట్టుమిట్టాడుతుండగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య కిరణ్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్య కిరణ్ కూడా మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన యువకుడు. తన అమ్మమ్మగారి ఊరైన ఊరుకొండలో తన మేనమామ దగ్గర పని చేయడానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లడం తీవ్ర విశాదాన్ని నింపింది. సూర్య కిరణ్ తల్లి ఇదివరకే చనిపోవడంతో ఇంటిదగ్గర ఉండలేక మేన మామ దగ్గరకు బతుకుదెరువు కోసం వచ్చి బలైపోవడంతో ఊరుకొండ, రాణిపేట, వెంకటాపూర్ గ్రామాలలో తీవ్ర విశాదచాయలు అలుముకున్నాయి. మృతి చెందిన రాజేష్ సూర్యకిరణ్ లు తల్లికి ఒక్కొక్కరే ఉండడంతో ఆయా కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలకు పోస్టుమార్టం చేయించెందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.