రోడ్లు డ్రైనజీ సమస్యలను చూసి చలించి పోయిన మాజీ ఎమ్మెల్యే రేవూరి
రైట్ ఆఫ్ : రోడ్ల పైన నాట్లు వేస్తున్న రేవురి
జనం సాక్షి నర్సంపేట
టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందో నర్సంపేటలోని రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసనసభ్యుల రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, కుమ్మరికుంట, పార్కు, సర్వాపురం బైపాస్ రోడ్డు ప్రాంతాలలో బిజెపి నేతలతో కలిసి పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితిని చూసి చలించి పోయారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేసి. స్థానిక ఎమ్మెల్యే పనితీరును, ప్రభుత్వ పాలనను ఎండగడుతూ నిరసన తెలిపారు
ప్రజల ఇబ్బందులు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విఫలమైనారని నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని కాలనీలు మారుమూల గ్రామాల కంటే అద్వాన్న స్థితిలో ఉన్నాయని, వర్షం పడితే చాలు రోడ్లపై ప్రజలు నడిచే పరిస్థితి లేదని సర్వాపురంలో ఇటీవల రోడ్డుపై నడుస్తూ మండల సారమ్మ కాలు విరిగినదని కనీసం వైద్య సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు.
తాను శాసనసభ్యునిగా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధి తప్ప స్థానిక శాసనసభ్యులు చేసింది ఏమీ లేదని, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందే కనిపిస్తారని గెలిచిన తర్వాత కనిపించరని ప్రజలే స్పష్టంగా చెప్తున్నారని అన్నారు. కుమ్మరి కుంటలో కేంద్ర ప్రభుత్వము టూరిజం నుండి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కోటి 50 లక్షలు వస్తే ఆ నిధులు మంజూరైనా అవి ఏం చేశారని నిలదీసారు. అదేవిధంగా ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం లో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ నుండి కోటి 61 లక్షలు మంజురైతే నాణ్యతలేని పనులు చేపట్టి ఆ నిధులు దుర్వినియోగం చేశారని రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కు నర్సంపేట పట్టణంలో రోడ్ల దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కుమ్మరి కుంట కాలనీలో ఆరు నెలల లోగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు వేయించి మురికి కుంటలు లేకుండా చేయవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పై ఉందని, సర్వాపురం పాఖల బైపాస్ రోడ్డు నెలలలో పూర్తి చేయకుంటే తన వల్ల కాదని చేతులు ఎత్తి వేసి తన అసమర్ధతను ఒప్పుకుంటే తానే తన సొంత ఖర్చులతో రోడ్డు వేసి అభివృద్ధి చేసి చూపిస్తానని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ రెడ్డి, జగన్, సత్యనారయణ , శ్రీనివాస్, నర్సింహులు,రాజు , వార్డ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు