లోక్‌సభలో 27 మంది కాంగ్రెస్‌ ఎంపీల బహిష్కరణ

c

– మంత్రులు రాజీనామా చేయరు: రాజ్‌నాథ్‌

– చరిత్రలో చీకటి రోజు సోనియా

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) :

పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్న 27 మంది కాంగ్రెస్‌ సభ్యలును సభనుంచి సస్పెండ్‌ చేశాక లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్‌ సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనా సభలో అదే పరిస్థితి కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శించవద్దని, సమస్యలపై చర్చ చేయాలని పదేపదే స్పీకర్‌ చేసిన వినతిని విపక్షాలుపెడచెవిన పెట్టాయి. అంతేగాకుండా విపక్ష ఎంపీలు స్పీకర్‌ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేసే వరకు సమావేశాలను జరగనివ్వబోమని ఎంపీలు స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు జరగాలని, అందుకు అందరూ సహకరించాలని సభాపతి ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో ఆందోళన చేపట్టిన 27 మంది ఎంపీలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ నుంచి 5 రోజుల పాటు 377 రూల్‌ ప్రకారం సస్పెండ్‌ చేస్తూ… సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ పలుమార్లు సభ్యులకు సర్ది చెప్పారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను మరునాటికి వాయిదా వేశారు.

ఈ నేపద్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎమ్‌.వెంకయ్య నాయుడు ఆద్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమవేశం కూడా ఏవిూ తేల్చలేదు.  మంత్రులు రాజీనామా చేయాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ తిరస్కరించారు. వారిపై ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజీనామాకు  ప్రభుత్వం ససేమిరా అనడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు పట్టుకుని నిరనస వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఎంపీలపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని, లేని పక్షంలో సభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ హెచ్చరించారు. ఫ్లోర్‌ లీడర్లు తమ ఎంపీలను వెనక్కి పిలవాలని స్పీకర్‌ కోరారు. అయినా ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. దీంతో స్పీకర్‌ ఆందోళన చేస్తున్న ఎంపీల పేర్లు చదివి వారిని సస్పెండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చలకే విలువ ఉంటుందని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. విపక్షాల వినతి మేరకే తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని విధాలుగా చర్చించిన తర్వాత విచారణ చేయిద్దామని రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్చ చేపట్టకుండా, నిజాలు తెలుసుకోకుండా కేవలం రాజీనామా చేయాలని చెప్పి సభా కార్యాక్రమాలను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే  వ్యాపం కుంభకోణం, లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాల్సిందేనని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జునఖర్గే డిమాండ్‌ చేశారు. వారు రాజీనామా చేశాకే చర్చకు అనువుగా ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుంటే  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను రాజీనామా చేయాలని సభలో ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ అభివర్ణించారు. ఎంపీలను సస్పెండ్‌ చేసిన 5 రోజులూ పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది.