వచ్చే యేడాది నుంచి స్టేట్ ఫెస్టివల్‌గా లష్కర్ బోనాలు
హైదరాబాద్, జూలై 15 (జనంసాక్షి):
లాల్ దర్వాజా మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన సి.రామచంద్రయ్య బోనాల వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించు కున్నారు. సంబరాలు అంబరాన్ని తాకేలా ఆలయాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపా లతో అలంకరించారు. పాతబస్తీలోని లాల్‌ద ర్వాజ సింహవాహిని ఆలయం వద్ద భక్తులు బారులుదీరారు. బోనాలు సమర్పించుకున్నారు. ఆదివారం .
తెల్లవారుజా మున నాలుగు గంటల నుంచే భక్తులు బారులు దీరారు. ఆషాఢమాసం, పైగా చివరి ఆదివారం కావడంతో అమ్మవారికి పూజాదికాలు నిర్వహించారు. కలశపూజ, కుంకుమ పూజ, చండీ హోమాలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు మహిళలకు చీరలు అందజేస్తున్నారు. ఆదివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మంత్రి దానం నాగేందర్, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్, తదితరులు పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ప్రారంభమైన బోనాల ఉత్సవం సోమవారం సాయంత్రం నిమజ్జనంతో ముగియనున్న విషయం తెలిసిందే. పాతబస్తీలోని ఉప్పుగూడ, లాల్‌దర్వాజ, గౌలిపురా, సుల్తాన్‌షాహి, హరిబౌలి, బేలా చందూలాల్, మండీ మీరాలం, మురాద్‌మహల్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేక బారికేడ్లు నిర్మించారు. బోనాల ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ మండలం, పశ్చిమ మండలం పరిధిలోని పాతబస్తీలో ప్రత్యేక బలగాలను మోహరించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజ, చార్మినార్ భాగ్యలక్ష్మి, మొగల్‌పురాలోని అక్కన్నమాదన్న, కార్వాన్ మైసమ్మ, ముస్లింజంగ్‌పూల్ భూలక్ష్మమ్మ తదితర ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. అంతేగాక పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆయా ప్రాంతాల్లోకి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. పోలీసుల ఆంక్షల్లో భాగంగా ఆదివారం జంట నగరాల్లోని మద్యం దుకాణాలు మూతపడ్డాయి. సోమవారం కూడా మూసివేత కొనసాగుతుంది.
అమ్మవారికి బోనం సమర్పయామి
ముత్తైదువలు అమ్మవారికి ప్రసాదం వండుతారు. కుండను తెచ్చి దాన్ని శుభ్రం చేసి పసుపు రాస్తారు. కుంకుమతో బొట్టు పెడతారు. ఆ కుండపై మరో చిన్న కుండ ఉంచుతారు. అందులో పసుపునీళ్లు, దానిపై రెండు దీపపు ప్రమిదలు ఉంచి వెలిగిస్తారు. రెండు కుండల మధ్య వేపాకులను ఉంచుతారు. అగర్‌బత్తీలు వెలిగిస్తారు. అయిదు రకాల పదార్ధాలతో వండేదే బోనం. అమ్మవారికి బోనం సమర్పిస్తారు. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారికి మొక్కుకుంటారు.
బజారుఘాట్‌లోని బంగారు ముత్యాలమ్మ దేవాలయం, నాంపల్లి లోని ఏడుగుళ్ల పోచమ్మ, కోమటికుంట కట్టమైసమ్మ, అసిఫ్‌నగర్ గండి మైసమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం, మహంకాళీ ఆలయం, జియాగూడ లోని నల్లపోచమ్మ, లంగర్‌హౌస్, గోల్కొండ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. రాంకోఠిలోని మహంకాళి ఆలయం, కందస్వామిలేన్‌లోని నల్లపోచమ్మ ఆలయం, ఉమెన్స్ కళాశాల, ఇసామియా బజార్, రాంకోఠి చౌరస్తా, బొగ్గులకుంట, గౌలిగూడ బస్సు డిపో వీధిలోని అమ్మవారి ఆలయాల్లో భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు.