వరంగల్‌లో డిపోల ముందు కార్మికుల బైఠాయింపు
వరంగల్,నవంబర్14 (జనంసాక్షి) : వరంగల్ పట్టణంలో ఆర్టీసీ 41వరోజు ఉధృతంగా సాగుతోంది. హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్ గ్రావిూణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం వేసుకొని నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెక్రసీ నేతలు మద్దతు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం,మధిర డిపోల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. కామారెడ్డి పట్టణంలో గురువారం ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. బస్టాండ్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని వెంటనే విలీనం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తన మొండివైఖరి వీడాలన్నారు. డిపోలోకి చొచ్చుకెల్లే క్రమంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు.