వర్షంలోనే పోలీసు పరుగు పందేలు
ఏలూరులో స్పృహ తప్పిన ఐదుగురు మహిళా అభ్యర్థులు
ఏలూరు, జూలై 10 : పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి అధికారులు నిర్వహిస్తున్న పరుగు పందేలు నిరుద్యోగులకు ప్రాణాంతకంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు అధికారులు నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడటం తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐల నియామకాల్లో భాగంగా 5 కిలోమీటర్లు, రెండున్నర కిలోమీటర్ల పరుగు పందేలు నిర్వహించడం నిబంధనల ప్రకారం జరిగే తంతు. అయితే ప్రతికూల వాతావరణంలో సైతం అధికారులు ఇష్టారాజ్యంగా ఈ పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో పరుగు పందెంలో పాల్గొంటున్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తూనే ఉంది. అయినా అధికారులు తమ పని ముగిస్తే చాలన్న ధోరణిలో జోరుగా కురుస్తున్న వర్షంలో సైతం మహిళల ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి అభ్యర్థినులకు రెండున్నర కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఏలూరు మినీ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ పరుగు పందెంలో పాల్గొన్న మహిళలు వర్షం ధాటికి పరుగెత్తలేక విలవిలలాడారు. ఐదుగురు మహిళలు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయారు. వారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో 108 అంబులెన్స్‌ను రప్పించారు. ఆక్సిజన్ ఎక్కించి సెలైన్లతో వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలోనూ ఇదేమాదిరిగా వర్షంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించగా, పలువురు యువకులు పరుగెత్తలేక స్పృహ కోల్పోయారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై లేవలేని స్థితికి వచ్చాడు. ఇప్పటికీ ఆయన కోలుకోలేదు. వర్షాలు కురుస్తుంటే పరుగు పందేలు నిర్వహించడం ఏమిటని అధికారులు నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు తారా స్థాయిలో వినిపిస్తున్న వారు మాత్రం ఇదంతా షెడ్యూల్ ప్రకారం జరిగే ప్రక్రియేనంటూ సమర్థించుకోవటం విశేషం.