వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
నిజామాబాద్, జూలై 10 : వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సక్రమంగా విధులను నిర్వహించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డి.వరప్రసాద్ హెచ్చరించారు. వైద్యులు, ఎఎన్‌ఎంలు అధిక శాతం తమకు కేటాయించిన గ్రామాల్లో ఉండడం లేదని ఆయన అన్నారు. మంగళవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.డయేరియా లాంటి వ్యాధులను దరిచేరకుండా గ్రామాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతీవారం తాగునీటిలో క్లోరినేషన్ నమూనాలను తీసుకుని అధికారులకు నివేదికలు సమర్పించాలని సూచించారు. నీటి ట్యాంక్‌లో బ్లీచింగ్ పౌడర్ ఎంత శాతం కలుపుతున్నారని అడిగి తెలుసుకోవాలని వైద్యులకు, సూపర్‌వైజర్లకు కలెక్టర్ సూచించారు.పై అధికారులే సక్రమంగా పని చేయకపోతే కింది స్థాయి సిబ్బంది పని ఎలా చేస్తారని ఆయన తెలిపారు. ఏ గ్రామంలోనైనా డయేరియా తదితర వ్యాధులు సోకినట్లయితే వెంటనే స్పందించి ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రోగాలు అదుపులో లేకపోతే తహసీల్ధార్ దృష్టికి తీసుకురావాలని వరప్రసాద్ సూచించారు.వైద్యులు తప్పనిసరిగా ఏదో ఒక రోజు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు జరపాలని అన్నారు. గ్రామాల్లో నీటి పైపు లైన్ల లీకేజీలను డ్రైనేజీల మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఇది వరకే గ్రామ స్థాయి పంచాయతీ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గ్రామాల్లో పరిశుభత్రపై స్థానిక మాజీ ప్రజాప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి పరిశుభ్రతలో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతీ ఏఎన్‌ఎమ్ వారానికి వంద ఇళ్లను సందర్శించి కుటుంబాల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలన్నారు. ఎక్కడైనా నీటి లీకేజితో డయేరియా ప్రబలితే ఆ నీటిని నిలిపివేసి ఇతర నీటిని అందించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్, డిఎంహెచ్‌వో హరినాథ్, డిసిహెచ్ తులసీబాయి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.