వర్షాలతో వాగులకు “జలకళ

జూలూరుపాడు, జులై 8, జనంసాక్షి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆకాశం నల్లని మేఘావృతమై వాతావరణం ముసురు పట్టింది. కొద్ది గంటల పాటు మండల పరిధిలోని పాపకొల్లు అటవీ ప్రాంతంలోని ఎత్తైన గుట్టలు, సూరారం ప్రాంతంలోని కనకగిరి గుట్టలపై తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఎగువ ప్రాంతంలోని వరద వాగులు, వంకల ద్వారా దిగువ ప్రాంతానికి చేరుతుంది. వరద ప్రవాహంతో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వాగులకు జలకళ ఉట్టిపడుతుంది. గుండ్లరేవు, బేతాళపాడు, కరివారిగూడెం ప్రాంతాల్లో ప్రవహించే పెద్దవాగు, చింతలవాగులకు ప్రతి ఏటా వర్షాకాలంలో వరద ఉధృతి పెరుగుతుంది. ఆ సమయంలో పలు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మండల యంత్రాంగం శుక్రవారం పలు గ్రామాల పరిధిలోని వాగులను సందర్శించి వరద ఉధృతిని అంచనా వేసింది. వర్షాకాలం సమయంలో అధిక వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం ముందుస్తు చర్యలకు సమాయత్తమైంది