వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై జూలై 20న విద్యాసంస్థల బంద్
భీంగల్:ప్రతినిధి(జనంసాక్షి):తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20 న విద్యాసంస్థలు బంద్ ను విజయవంతం చేయాలని పిడీఎస్ మండల కన్వీనర్ నరసింహ తెలిపారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురి చేసిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత, భవనాల కొరత, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కొరత తీవ్రంగా ఉందన్నారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. కానీ ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేసి, వాటిని సంస్కరించడంలో కనీస శ్రద్ధ చూపెట్టట్లేదన్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు. మెజారిటీ వాటికి సొంతభవనాలు లేవన్నారు. యూనివర్సిటీలు నిధుల లేమి, ఖాళీ పోస్టులతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల డొల్లతనాన్ని ఇటీవల వచ్చిన వర్షాలు బయటపెట్టాయని ఎద్దేవా చేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు అందకపోవడం దారుణ పరిస్థితిని తెలియజేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగాన్ని సంస్కరించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని,పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు యూనిఫామ్ లను అందివ్వాలని,కేజీబీవీలు,గురుకు లాలు ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు సమకూర్చి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పై డిమాండ్లలో భాగంగానే ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామన్నారు.ఈ బంద్ ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు, అందరూ విజయ వంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో హరీష్,ఆకాష్,నితిన్,హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు