వారం రోజుల్లోపు అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పూర్తి కావాలి ..
వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ ఆదేశం…
నిజామాబాదు, బ్యూరో,(జనంసాక్షి): ఫిబ్రవరి 11 : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరైన ప్రగతి పనులన్నీ వారం రోజుల్లోపు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. వారం వ్యవధిలో ఎక్కడైనా పనులు ప్రారంభం కానీ పక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా మండలాల అధికారులతో అభివృద్ధి పనుల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. వివిధ మండలాలలో ఆయా పథకాల కింద మంజూరీలు తెలిపిన పనులు ఎన్ని, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయన్నది ఆరా తీస్తూ, అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. సివిల్ వర్క్స్ వేగవంతంగా చేపట్టేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయం అయినందున పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్చి నెలాఖరు నాటితో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా, నిర్ణీత గడువుకంటే ముందే పనులన్నీ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. గడువు లోపు పనులు చేపట్టని పక్షంలో నిధులు మళ్ళిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు తమతమ శాఖల పరిధిలోని ప్రతి అభివృద్ధి పని తప్పనిసరిగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎడపల్లి మండలంలో రూర్బన్ పథకం కింద చేపట్టాల్సిన పనులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని, తక్షణమే వాటిని చేపట్టి సత్వరమే పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. సి.సి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ పథకం కింద మంజూరీలు తెలుపబడిన ఏ ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టే పనులకు నిధుల సమస్య లేదని, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నిర్దిష్ట గడువుకంటే ముందే అవి పూర్తయ్యేలా అధికారులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్ పీ సీఈఓ గోవింద్, డీఆర్డీవో చందర్ నాయక్ తో పాటు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఏ.ఈలు పాల్గొన్నారు..