వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌పై భారత మహిళల గెలుపు

ముంబై ,జనవరి 28:వరల్డ్‌కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారత బౌలర్ల ధాటికి 201 పరుగులకే ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మెక్‌గ్లాషన్‌ , మెక్‌గే హాఫ్‌ సెంచరీలతో రాణించి ఆ మాత్రం స్కోరైనా నమోదు చేయగలిగారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఝులన్‌ గోస్వామి 3 , బిస్ట్‌ 2 , హైదరాబాదీ గౌరా సుల్తానా 2 వికెట్లు తీసుకున్నారు. బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. లక్ష్యఛేదనలో ఓపెనర్లు పూనమ్‌ రౌత్‌ , కామిని తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. రౌత్‌ 69 , కామిని 43 పరుగులకు ఔటైనా… మిథాలీరాజ్‌ , హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వీరి జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు జోడించింది. భారత్‌ 43.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌ తన తర్వాతి వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్టేల్రియాతో తలపడనుంది.