విజయమ్మ దీక్షకు … తెలంగాణవాదుల బ్రేక్‌

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సమైక్యవాదుల చేనేత దీక్షకు సిరిసిల్లలో తెలంగాణవాదుల నిరసన సెగ తగిలింది. తెలంగాణ ప్రత్యేయ రాష్ట్ర ఏర్పాటుపై తమ వైఖరి తెలపాలంటూ అడుగడుగునా తమ నిరసనలు తెలిపారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలోని పద్మానగర్‌లో గల వాటర్‌ టాంకుపై తెరాస నాయకులు ఎక్కి విజయమ్మ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదుల పాలనలో తమకన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రంతోనే మా బతుకులు బాగుపడతాయంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వానికి వైఎస్‌ఆర్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలమని లేఖ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పోలీసు బలగాలతో సిరిసిల్లకు చేరుకున్న విజయమ్మను స్థానిక గాంధీ చౌక్‌ వద్ద తెరసా మహిళా నాయకురాళ్లు అడ్గుకున్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణా ద్రోహి అని జగన్‌ను అధికారంలోకి తేవడానికి కుటిల రాజకీయం చేస్తున్నావంటూ ఆమెపై మహిళలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు, మహిళలు, యువకులపై లాఠీఛార్జీలు చేశారు. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో యువకులు తెలంగాణా నినాదాలు చేశారు. సరస్వతి అనే మహిళ పోలీసు వాహనంపై కెక్కి తెలంగాణా ద్రోహుల్లారా, రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పకతప్పదంటూ చెప్పులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తోపులాటలో దాదాపు పది మంది సొమ్మసిల్లారు. తెరాస కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు చొచ్చుకుపోయి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.