విజయ డెయిరీ పాల లీటరుకు రూ.4.68 పైసల పెంపు
- లీటరుకు రూ.4.68 పైసల పెంపు
- పాడి రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
- జిల్లాలో 3500 మంది మందికి చేకూరనున్న లబ్ధి
నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 24 : పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విజయ డెయిరీ పాడిరైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలుచేయడంతోపాటు లీటరుకు రూ.4 ఇన్సెంటీవ్‌ను కూడా కొన్నేండ్లుగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇదిలా ఉండగా తాజాగా పాడి రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు విజయ డెయిరీ ఉన్నతాధికారులు మంత్రి ప్రకటనకు అనుగుణంగా పెంచిన పాల ధర వివరాలను సర్క్యులర్ ద్వారా అన్ని విజయ డెయిరీ జిల్లా కార్యాలయాలకు పంపనున్నారు. రైతుల నుంచి సేకరించిన పాలలో ఉన్న వెన్న (ఎస్‌ఎన్‌ఎఫ్) శాతాన్ని బట్టి ధర చెల్లిస్తారు. తాజాగా మంత్రి వెల్లడించిన ప్రకారం ఒక లీటరు పైన రూ.4.68 పైసలు పెంచి ఇవ్వనున్నారు. గతేడాది 2021 ఫిబ్రవరి 16న ఒక లీటర్ పైన 2 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ సారి రూ.4.68 పైసలు పెంచడంపై పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3,500 మంది పాడి రైతులకు లబ్ధి
సారంగాపూర్ విజయ డెయిరీ ద్వారా జిల్లా వ్యాప్తంగా 3,500 మంది పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నారు. పాల ధర పెంపుతో 3,500 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఒక లీటర్ పాలలో ఆరు శాతం వెన్న ఉన్నట్లు యావరేజ్‌గా తీసుకుంటే ప్రస్తుతం రూ.36.99 పైసలు విజయ డెయిరీ రైతులకు చెల్లిస్తున్నది. అయితే తాజాగా లీటరు పైన రూ.4.68 పైసలు పెరగడంతో రూ.41.64 పైసలు ఇవ్వనుంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా రోజుకు ప్రస్తుతం 4,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఇందుకుగాను విజయ డెయిరీ ఇప్పటివరకు ఒక లీటర్ పాలలో వెన్న యావరేజ్‌గా 6 శాతం బట్టి ఒక లక్షా 62 వేల రూపాయలు రైతులకు చెల్లిస్తున్నారు. పెరిగిన రేటు ప్రకారమైతే రోజుకు ఒక లక్షా 84 వేల 500 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని సారంగాపూర్ విజయ డెయిరీ మేనేజర్ రమేశ్ తెలిపారు.