విత్తనాల కొరతతో రైతుల అవస్థలు
ప్రత్యమ్నాయ పంటలపై రైతుల కష్టాలు
ఆదేశాల మేరకు అందుబాటులో లేవంటున్న అన్నదాతలు
నిజామాబాద్,డిసెంబర్10 జనంసాక్షి: పంటలు వేసిన రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని అన్నదాతలను భయపెట్టిన తెలంగాణ సర్కారు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని హుకుం జారీ చేసింది. అయితే అందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం మరిచి పోయింది. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతన్నలు తాజా వైఖరితో మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. యాసంగిలో వరి వేస్తే తమకు సంబంధం లేదన్న ప్రభుత్వం ప్రత్యామ్నా యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాలు సాగు చేయాలని సూచించింది. ప్రస్తుతం మార్కెట్ లో మినుము, కుసుమ, సన్ ప్లవర్ విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నందున ఆ పంటల వైపు మళ్లాలని చెప్పింది. అయితే ఆయా పంటల విత్తనాలను అన్నదాతలకు అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. ªరిన్నేళ్లుగా రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం వరి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నారు. దీంతో కందులు, మినుములు, పెసర్లు, శెనగలు, నువ్వుల పంటల సాగు చాలా వరకు తగ్గిపోయింది. ఒక్కప్పుడు తాండూర్ కందులకు దేశంలోనే పెద్ద మార్కెట్ గా పేరుగాంచింది. నువ్వులకు కరీంనగర్, పల్లీలకు మహబూబ్ నగర్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంటకు ప్రసిద్ది గాంచింది. టీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయాల కారణంగా ఈ పంటల సాగు తగ్గిపోయి వరి, పత్తి సాగు పెరగడం మొదలైంది. దీంతో మిగతా పంటల విత్తనాలు దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆముదాల విత్తనాలు మినహా.. మిగతా ఏ పంటకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విత్తనాభివృద్ధి సంస్థ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడంతో సీడ్స్ కోసం ఇతర రాష్టాల్రపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిరది. యాసంగి పంట మార్పు విషయం ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకాలం మించిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. నువ్వులు, పెసర, మినుముల సాగు గడువు డిసెంబర్ పదో తేదీతో ముగియనుంది. సన్ ప్లవర్, జొన్నకు సంబంధించి డిసెంబర్ 31వరకు సమయం ఉంది. అయితే ప్రస్తుతం ఈ విత్తనాలేవీ అందుబాటులో లేవు. ఏపీ నుంచి మినుములు కోనుగోలు చేయాలంటే గతంలో కిలో వంద నుంచి 120 రూపాయలు ఉండేది. ఇప్పుడు 250 నుంచి 300 పలుకుతోంది. సన్ ప్లవర్ కు సంబంధించి మూడిరత ధర ఎక్కువగా చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగికిలో వేయాల్సిన పంటలకు సంబంధించి 75శాతం గడువు పూర్తయిపోయింది. మిగిలిన 25 శాతం సాగు మిగిలింది. ఈ పంటల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలంటున్నారు రైతులు.