విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
– కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
రంగారెడ్డి, డిసెంబర్12(జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఘట్‌కేసర్‌లోని బాలికల, బాలుర పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు.. బాగా చదువుకోవాలనీ, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని వారికి సూచించారు. ఉపాధ్యాయులనుద్ధేశించి మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని, తద్వారా వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా బాధ్యతల తీసుకోవాలని అన్నారు. పిల్లలతో స్నేహంగా ఉండాలనీ, వారికి భయపెట్టకుండా, ప్రేమగా పాఠాలు భోదించాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో
జరుగుతున్న పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కార్మికులతో మాట్లాడిన మంత్రి.. పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత ఉండాలని వారికి సూచించారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఏ అభివృద్ధి పనైనా.. నాణ్యతగా నిర్మించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంలో మంత్రితో పాటు మాజీ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.