విద్యార్థుల సమస్యలపై ఆందోళన ఉధృతం

నెల్లూరు, జూలై 10 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఆందోళన ఉధృతం చేయాలని మంగళవారం నాడు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ ఫ్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.కిరణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన సెలవు దినాల్లో కళాశాలలను నడపడం వంటి సమస్యలపై వారు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు జరుపుతున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల యజమానులు ఆ డబ్బును వడ్డీకి మారుస్తూ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ అందించడం లేదని అన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజులు ఆన్‌లైన్‌లో పేర్లను తప్పిస్తూ దోపిడీకి పాలుపడుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం కనబడడం లేదని అందువల్లనే ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.