విద్య కాషాయికరణకు కుట్ర

C

– దివంగత రాజీవ్‌పై ఆరోపణలు మానండి

– దమ్ముంటే లలిత్‌ మోడీని రప్పించండి

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌

ఢిల్లీ ఆగస్ట్‌13(జనంసాక్షి):

ఆర్‌ఎస్‌ఎస్‌ నీడలో విద్యాసంస్థలను కాషాయీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా విద్యార్థుల సమస్యలపై రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌ పదవికి మెరిట్‌ ఆధారంగా నియామకం చేపట్టలేదని రాష్ట్రపతికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌టిఐఐ ఛైర్మన్‌గా కేంద్రం గజేంద్ర చౌహాన్‌ ను నియమించడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గజేంద్ర చౌహాన్‌ నియామకం ద్వారా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లోను కాషాయీకరణకు కేంద్రం తెర లేపిందని రాహుల్‌ విమర్శించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందని రాహుల్‌ పేర్కొన్నారు.

దమ్ముంటే లలిత్‌ మోడీని రప్పించండి: రాహుల్‌

విదేశాల్లో ఉన్న లలిత్‌మోదీని దమ్ముంటే భారత్‌కు తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. లలిత్‌గేట్‌పై చర్చించే ధైర్యం లేక మోదీ పారుపోతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వ్యాపం కుంభకోణంలో నిందితులను కాపాడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు.   దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీకి బోఫార్స్‌ కేసులో సుప్రింకోర్టులో క్లీన్‌చీట్‌ వచ్చిందని, ఆయన పై ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజు కూడా స్తంభింపచేసిన కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం రాహుల్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. సుష్మాస్వరాజ్‌ వెంటనే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. సమస్యలపై చర్చించే దమ్ము లేక ప్రబుత్వం పారిపోయిందన్నారు. ప్రధాని ఎందుకు మౌనం వహించారని అన్నారు. కాగా ఎన్డిఎ ఎంపిలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రాష్ట్రపతి వద్దకు వెళ్లగా కాంగ్రెస్‌ ఎంపిలు రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లు మహాత్మగాందీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలు ముగిసిన తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉభయ సభలు నిరవధిక వాయిదాపడిన అనంతరం పార్లమెంట్‌ ఎదుట కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. లలిత్‌మోదీ వ్యవహారం, వ్యాపం కుంభకోణంపై కేంద్ర తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పార్లమెంటు విజయ్‌చౌక్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు సేవ్‌డెమొక్రసీ పేరుతో ఎన్డీయే ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చూశారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేసారు. ఎన్డీయే, యూపీఏ పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంటు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.