విపక్షాల బంద్ విజయవంతం
– 10 జిల్లాలో ప్రశాంతంగా హడ్తల్
హైదరాబాద్, అక్టోబర్10(జనంసాక్షి):
రైతులకు ఏక మొత్తంలో రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. అయితే పోలీసులు ఎక్కడిక్కడే నేతలను అరెస్ట్ చేసి బంద్‌ను అడ్డుకున్నారు. ఆర్టీసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య బస్సులు నడుపుతున్నారు.జిల్లాల్లో నేతలు ఉదయం నుంచే బంద్‌కు సహకరించాలని తిరుగుతూ ప్రజలను, వ్యాపారవర్గాలను కోరారు. ఎక్కడిక్కడ దుకాణాలను మూసేయించారు. విపక్షాల బంద్ పిలుపుతో జిల్లాలు ¬రెత్తుతున్నాయి. పలు పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వివిధ జిల్లాల్లో బంద్ సందర్బంగా ఉదయంనుంచే ఆయా పార్టీల నేతలు బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ సచివాలయం ముట్టడికి విఫలయత్నం చేశారు. ఒక్కసారిగా కొందరు కార్యకర్తలు సచివాలయం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ /-టసేషన్ పరిధిలోని కశీష్ ఫంక్షన్‌హాల్ వద్ద చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు… ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై బస్సు డ్రైవర్ సైదులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాణిగంజ్ బస్‌డిపో ఎదుట కాంగ్రెస్, బీజేపీ కార్యర్తలు ఆందోళన చేశారు. ఆందోళన చేసినందుకు మల్లు భట్టి, శశిధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పీఎస్‌కు తరలించారు. మరోవైపు జీడిమెట్ల బస్ డిపో ఎదుట టీడీపీ ఆందోళన కార్యక్రమం చేశారు. రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ప్రకాశ్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలు బైఠాయించారు. రాజేంద్రనగర్ బస్ డిపో వద్ద ధర్నా చేపట్టిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్/-నడ్, భాజపా, సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.సబితా ఇంద్రారెడ్డిని మహేశ్వరం పీఎస్‌కు, ప్రకాశ్ గౌడ్, కార్యకర్తలను మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. మెదక్ బస్‌డిపో ఎదుట కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఆందోళన నిర్వహించాయి. అలాగే ప్రజ్ఞాపూర్ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భైంసా బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరె స్ట్ చేశారు. అలాగే మంచిర్యాల, నిర్మల్ బస్టాండ్ల వద్ద కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి.
రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. కరీనంగర్ బస్టాండ్ వద్ద చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొని బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
వరంగల్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకున్న ప్రతిపక్ష నేతలు
రైతులకు ఏక మొత్తంలో రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగింది. హన్మకొండలో బంద్‌లో పాల్గొన్న విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బస్సులను అడ్డుకున్న నేతల్ని అదుపులోకి తీసుకుని ఠాణాకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ పలువురు భాజపా నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ బస్ డిపో ఎదుట ధర్నా
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెదేపా శ్రేణులు బంద్ నిర్వహించారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో పాటు తెదేపా జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు బస్‌డిపో ఎదుట బైఠాయించారు. వీరికి భాజపా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జత కలిశాయి. విపక్షాల బంద్‌తో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నల్లగొండలో బంద్ ప్రభావంత తీవ్రంగా ఉంది. విపక్ష నేత జానారెడ్డి, పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి సోదరులు, నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు నల్లగొండ జిల్లాకు చెందినవారే కావడంతో బంద్ ప్రశాంతంగా సాగింది. పిసిసి అద్యక్షుడు కూడా అక్కడి వారే కావడంతో సహజంగానే ఈ బంద్ కు ప్రాధాన్యత ఏర్పడింది.
సమస్య పరిష్కారానికి జైలుకైనా వెళతాం: జానారెడ్డి
ప్రజా సమస్యల పోరాటంలో అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్దమని శాసనసభ లో విపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. బంద్ సందర్భంగా పోలీసుల అత్యుత్సాహాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకున్నా ముందస్తు అరనరెస్ట్‌లు చేయడాన్ని తప్పు పట్టారు. విపక్షాలు తలపెట్టిన బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బలవంతంగా,భయపెట్టి షాపులను ప్రభుత్వం తెరిపిస్తోందని ఆయన అన్నారు.గోషా మహల్ వద్ద అరెస్టు అయి ఉన్న కాంగ్రెస్ నేతలను పరామర్శించిన తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. విపక్షాలన్ని ప్రజా సమస్యల విషయంలో కలిసి పోరాడడం మంచి పరిణామమని జానారెడ్డి అన్నారు. బంద్ లో జానారెడ్డి పాల్గొనలేదంటూ వచ్చిన విమర్శల నేపద్యంలో జానారెడ్డి గోషా మహల్ వద్దకు వెళ్లి కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంఘీబావం ప్రకటించారు. నిరంకుశ విధానానలను ఎదుర్కోవడానికి ఎలాంటి ఆందోళనకైనా సిద్దమన్నారు. సమస్యల పరిష్కారం కోసం జైళ్లకు వెళ్లేందుకైనా వెనుకాడమని జానారెడ్డి అన్నారు. సమస్య పరిష్కారం కోసం అన్ని పక్షాలు ఏకం కావటం సంతోషకరమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఇక ముందూ ఐక్యత చాటుకోవాలని కోరారు. బంద్ సమయంలో భయపెట్టి దుకాణాలను తెరిపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానిది ముమ్మాటికీ నియంతృత్వ ధోరణేనని విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అడ్డుకున్నా బంద్ విజయవంతమైందని పీసీసీ సారథి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
చెప్పారు. నిరసన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని వివరించారు. రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విపక్ష నేతలను అరెస్ట్ చేసి బంద్ విఫలం చేయాలని చూశారనీ, మంత్రులు ఇంట్లో కూర్చొని వాస్తవాలు మాట్లాడడం లేదని ఉత్తమ్ విమర్శించారు. తాము రాజకీయం చేయడం లేదనీ, బంద్ ఆరంభం మాత్రమేనని ఉత్తమ్ చెప్పారు.