విలువలు పాటిస్తేనే దేశాభివృద్ధి

C

రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి

పార్లమెంటులో యుద్ధ వాతావారణం దురదృష్టకరం

జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూదిల్లీ ఆగస్ట్‌14(జనంసాక్షి):

విలువలు పాటిస్తేనే దేశాభివృద్ధని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత బలమైనదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం ఓ గొప్ప కానుక లాంటిదని చెప్పారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత పార్లమెంటులో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపం పార్లమెంట్‌ అని, ఇక్కడ ప్రజా సమస్యలను చర్చించాల్సి ఉందని సూచించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమైందన్నారు. రాజకీయ పార్టీల తీరు మారాల్సిన అవసరముందని ప్రణబ్‌ చెప్పారు.

గత పదేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణల ప్రక్రియ కారణంగా వృద్ధిరేటు బాగా పెరిగిందని గుర్తుచేశారు. ఈ ఫలితాలు పేద ప్రజలకు చేరాలని, ప్రభుత్వ పాలసీలు ఆకలి బాధ లేని దేశంగా మారేలా ఉండాలని సూచించారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం మరిన్ని పథకాలు చేపట్టాలని ప్రణబ్‌ కాంక్షించారు.

దేశంలో విద్యా విధానం మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. మహిళలపై వివక్ష లేకుండా, వారికి సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. పాకిస్థాన్‌ రెచ్చగొట్టే వైఖరిపై రాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశంతో భారత్‌ స్నేహ బంధం కోరుకుంటుందని చెప్పారు. అలాగని భారత్‌ ను కవ్విస్తే ఊరుకునేది లేదని పాక్‌ కు గట్టి హెచ్చరిక చేశారు.

ఆత్మగౌరవం కోసం స్వాతంత్య్ర ఉద్యమం చేశామని, 69 ఏళ్లలో భారత్‌ ఎన్నో విజయాలు సాధించిందని రాష్ట్రపతి గుర్తుచేశారు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. మనం ఇప్పుడు మంచి చేస్తే ఏడు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రణబ్‌ సూచించారు.

నోబెల్‌ బహుమతి గెలుచుకున్న కైలాస్‌ సత్యార్థికి ప్రణబ్‌ అభినందనలు తెలిపారు. దేశ విదేశాల్లో జరిగిన టోర్నమెంట్లలో గెలిచిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రశంసించారు.