వివాదాస్పద పోలీసుల తీరుపై అధికారుల కన్ను…?
మహబూబ్‌నగర్,నవంబర్21: జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువై వారి కష్టాల్లో తోడుండాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులే వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఒకటయితే, కొంతమంది వ్యవహారశైలి కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ వివాదాలపై జిల్లా ఎస్పీ కూడా దృష్టి సారించారు. పోయిన పరువును కాపాడుకునేందుకు చర్యలు తసీఉకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారుల తీరుపై ఆయన కన్నేసినట్లు సమాచారం.వ్యక్తిగత వివాదాల్లో తలదూర్చడం, కేసుల్లో చురుకుగా వ్యవహరించకపోవడం వంటి కారణాలతో పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఏడాది వ్యవధిలో, జిల్లాలో నలుగురు ఇన్‌స్పెక్టర్లపై బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక అక్రమ దందాకు సహకరించారన్న ఆరోపణపై అచ్చంపేట సీఐ కిషన్‌ను జిల్లానుంచి బదిలీ చేశారు. ఒక యువతిని మోసం చేసిన కేసులో, అమ్రాబాద్ సీఐ పాండురంగారెడ్డిపై నల్గొండలో కేసు నమోదయింది. డేవిడ్‌రాజు హత్యకేసులో నిందితుల పేర్లు మార్చారన్న ఆరోపణలై జడ్చర్ల సీఐ షాకిర్‌హుస్సేన్ సస్పెండయ్యారు. నవాబ్‌పేట మండలం చెన్నారెడ్డిపల్లిలో చెన్నయ్య అనే వ్యక్తి హత్య కేసుతో సంబంధం లేకున్నా, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన కేసులో మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గిరిబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో, తామే హత్య చేశామంటూ ఏడుగురు లొంగిపోవడంతో, ఘటనపై మళ్లీ విచారణ జరిపిస్తామని, ప్రత్యేకాధికారిని నియమిస్తామని డీఎస్పీ హిమవతి గత ఆగస్టులో ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు, సదరు విచారణ అధికారి నియామకం జరిగిన దాఖలా లేదు. సుభాష్ అనే ఆర్మీ జవానును చితక్కొట్టిన ఘటనలో, వన్‌టౌన్ పోలీసులు మానవ హక్కుల కమిషన్ నుంచి విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఘటనకు సంబంధించి, వచ్చే నెల 12న హాజరై వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్, జిల్లా పోలీసులను ఆదేశించింది. కాగా, గద్వాల సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మరో ఎస్‌ఐ, మట్కా గ్యాంగ్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు- ఆరోపణలు వెల్లువెత్తాయి.సరిగ్గా ఏడాది కిందట జిల్లా కేంద్రంలోని ఒక బధిర పాఠశాలలో మూగ విద్యార్థి దారుణ హత్యకు గురయిన కేసులో ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. పాఠశాల నిర్వాహకుడు విజయ్‌హన్మాన్‌ను అరెస్టు చేసినా, సూత్రధారుల వివరాలు బయటకు రాలేదు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్ హత్యకేసులో పోలీసుల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో జిల్లా పోలీసులు ఆలస్యంగా స్పందించడం, విచారణలో జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించినందుకే వెంకటేశ్‌ను హత్యచేశారని ఆరోపిస్తూ, త్వరితగతిన విచారణ జరపాలని ప్రజాఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు.మిస్టరీ వీడని కేసుల్లోనూ.. షాద్‌నగర్ సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న మరో సీఐ కూడా భారీగా ఆస్తులు కూడబెట్టు-కున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు, కొంతమంది ఎస్‌ఐల వైఖరి కూడా పోలీసు శాఖకు కళంకంగా మారిందన్న విమర్శలున్నాయి. జిల్లాలో వివాదాలకు కారకులయిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ నాగేంద్రకుమార్ చెప్పారు.