వెన్ను నొప్పితో బాధపడుతున్న చాను

ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయం
న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  వెయిట్‌ లిప్టర్‌ విూరాభాయ్‌ చాను ఆసియ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు. వెన్నునొప్పితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తనకు రెస్ట్‌ ఇవ్వాలంటూ ఆమె భారతీయ వెయిట్‌ లిప్టింగ్‌ సమాఖ్యకు లేఖ రాసింది. ప్రస్తుతం తాను ఫిట్‌గా లేనని ఆమె తన లేఖలో పేర్కొన్నది. వెన్ను నొప్పి వల్ల ఆసియా క్రీడలకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు లిప్టర్‌ చాను తెలిపింది. నేరుగా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ప్రిపేర్‌ కావాలని భావిస్తున్నట్లు చాను పేర్కొన్నది. గత ఏడాది అమెరికాలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో చాను.. 48 కేజీల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత చీఫ్‌ కోచ్‌ విజయ్‌ శర్మ కూడా చానుపై అనుమానాలు వ్యక్తం చేశారు. జకర్తాలో జరిగే ఆసియా క్రీడలకు చాను దూరంగా ఉండడమే బెటర్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుర్తు తెలియని వెన్నునొప్పితో చాను బాధపడుతున్నట్లు చీఫ్‌ కోచ్‌ చెప్పారు.