వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ దృష్టి * పొలిమేర రోడ్డుకు”హరితహారం”

, జులై 14, జనంసాక్షి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జూలూరుపాడు పొలిమేర రోడ్డు.. జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామ పంచాయతీల విభజన రేఖ.. చరిత్ర కలిగిన పొలిమేర రోడ్డు దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. పొలిమేర రోడ్డుకు ఇరువైపులా జనావాసాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. పదేళ్ల క్రితం పొలిమేర రోడ్డుకు ఓ చివరన ఊరికి దూరంగా కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పొలిమేర రోడ్డుపై తమ అవసరాల కోసం ప్రయాణం సాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఏటా ప్రజల బాధలు వర్ణనాతీతం. విద్యాలయానికి వెళ్లాలంటే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక్కో సారి రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులకు పొలిమేర రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజలు చాలా ‌సార్లు విజ్ఞప్తి చేశారు. అయినా అభివృద్ధికి నోచుకోక పోవడంతో ప్రజలు నిస్సహాయత వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొలిమేర రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పొలిమేర రోడ్డు అభివృద్ధి విషయాన్ని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించి పొలిమేర రోడ్డు అభివృద్ధిలో భాగంగా కిలోమీటరు మేర సిమెంట్ రోడ్డు నిర్మాణానికి గత మార్చి నెలలో సుమారు 60 లక్షలు నిధులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ పర్యవేక్షణలో కొద్ది రోజుల్లోనే కిలోమీటరు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయటంతో ఇంజనీరింగ్ శాఖ కృషిని ప్రజలతో పాటు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే కిలోమీటరు సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటించేందు ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ చొరవ చూపించారు. ఈ మేరకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు కోసం ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎంపీడీవో రవితో పాటు సర్పంచ్ గలిగె సావిత్రి, పంచాయతీ కార్యదర్శులు సునీత, అనంత్ కుమార్, ఉపాధిహామీ పథకం ఉద్యోగులు గురువారం పొలిమేర రోడ్డును సందర్శించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటించేందుకు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ కృషితో పొలిమేర రోడ్డు సిమెంట్ రోడ్డుగా మారటం, వెంటనే పచ్చని చెట్లతో రోడ్డు ఆహ్లాదకరంగా మారే విధంగా మొక్కలను నాటించే పనులు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.