వ్యాక్సిన్‌ హెడ్‌క్వార్టర్స్‌ హైదరాబాద్‌ – మంత్రి కేటీఆర్‌

 

హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి):భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి రావడంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తల సేవలను కేటీఆర్‌ కొనియాడారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ విరాజిల్లుతోందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషి వల్లే హైదరాబాద్‌కు ఖ్యాతి వచ్చిందన్నారు. కొవిడ్‌ నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే.