వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ‘సత్యదేవుని’ సన్నిధి కరవైన నియంత్రణ
అన్నవరం, జూలై 13,: పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుందనే భక్తి భావనతో పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రైవేట్ వ్యాపార సంస్థల చేతుల్లో నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తుంది. భక్తిని ప్రబోధించవలసిన కొన్ని ఆలయ పరిసరాలు వ్యాపార కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానమే. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన అన్నవరం క్షేత్రం వ్యాపారస్తుల చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయిందనడానికి ఈనెల 4వ తేదీన జరిగిన వేలం పాటలే ప్రత్యక్ష సాక్ష్యం. అధికారుల నియంత్రణ కనీస స్థాయిలో కూడా లేకపోవడంతో ఐదు నుండి పది రెట్లు అదనపు ధరలకు భక్తులకు అవసరమైన సామాగ్రి విచ్చలవిడిగా అమ్ముకోవడానికి అధికారులు ద్వారాలు తెరడంతో వ్యాపారస్తులు నెలకు లక్షలాది రూపాయలు చెల్లించి వ్యాపార హక్కులను చేజిక్కించుకుంటున్నారు. సంవత్సరం కాలపరిమితిలో జరిగే వ్యాపారాల ద్వారా దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందనే అధికారులు భావిస్తున్నారు. కానీ భక్తులు పడే ఇబ్బందులను కనీస పరిగణలోకి తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస అవసరాలు తీర్చేందుకు వీలుగా పలు వ్యాపారాలను నిర్వహించేందుకు భక్తుల సౌలభ్యం కోసం నామమాత్రంగా ఇటువంటి వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజానికి బయట విక్రయించే ధరలకే దేవస్థానంలో కూడా ఆయా సామాగ్రిని విక్రయించాల్సి ఉంది. కానీ అన్నవరం దేవస్థానంలో పరిస్థితి అందుకు విరుద్దంగా మారిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది వ్యాపారం నిర్వహించుకునేందుకు గత ఏడాదితో పోలిస్తే సుమారు 50 శాతం అధికంగా సత్యదేవునికి ఆదాయం సమకూరింది. కేవలం నియంత్రణ లేకపోవడం క్రింది స్థాయి సిబ్బంది లాంచనాలు పొందడం వంటి కారణాలతో అధిక ధరలకు వెచ్చించి వ్యాపారాలను చేజిక్కించుకుంటున్నారు. దీంతో పాటు సరైన హామీ ఉన్నప్పటికీ బకాయిలు సకాలంలో వసూలు చేయకపోవడంతో కొంత మంది వ్యాపారస్తులు దేవస్థానానికే ఎగనామం పెడుతున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్ రూపంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లాటరీ విధానం ద్వారా మద్యం దుకాణాలను తక్కువ లైసెన్సు ఫీజులకు ఇవ్వడం జరిగింది. కానీ అన్నవరం దేవస్థానంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు మాత్రం అధికారులు అడ్డుగోలుగా అధిక ధరలు వసూలు చేసుకోవడానికి లైసెన్సు ఇస్తున్నారు. దీంతో భక్తులు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దేవస్థానం ఒక ధరను నిర్ణయించి వ్యాపార హక్కులను పొందేందుకు టెండర్లు ఆహ్వానించి లాటరీ పద్దతి ద్వారా షాపులు కేటాయించడంతో పాటు ఖచ్చితమైన ధరలు నియంత్రణ చేపట్టి అధిక ధరలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను రూపొందించినట్లయితే భక్తులకు చాలా వరకు ఊరట కలుగుతుందని పలువురు సూచిస్తున్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితమైన విధి విధానాలను ఏర్పాటు చేయాల్సిందిగా పలువురు భక్తులు బహిరంగంగా తెలుపుతున్నారు.