శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను కూల్చేస్తాం

c

– డెప్యూటీ సీఎం మహమ్ముద్‌ అలీ

వరంగల్‌/హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి):

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేది మరో అధునాతన ఆస్పత్రిని కట్టడం కోసమేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను అయినా కూల్చడంలో తప్పు లేదని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో తప్పేవిూ లేదన్న ఆయన శిథిలావస్థకు చేరితే చార్మినార్‌నైనా కూల్చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. పాత భవనాలు ముఖ్యమా అని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడంలో ఏమాత్రం తప్పు లేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం కోం ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో 10 అంతస్థుల ప్రపంచ స్థాయి ఆస్పత్రి నిర్మాణం చేపడతామని చెప్పారు. అయితే ఉస్మానియా ఆస్పత్రి పేరును మార్చడం లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఏర్పడడంతో సిఎం కెసిఆర్‌ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఇది మంచి నిర్ణయమేనన్నారు. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాక వాటంతట అవే కూలిపోక తప్పదన్నారు. నాలుగైదువందల ఏళ్ల తరవాత శిథితాలవస్థకు చేరుకుంటే చూస్తూ కూర్చుంటామా అని అన్నారు. మరోవైపు మహమూద్‌ అలీ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. చార్మినార్‌ కూల్చాలన్న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

వ్యాఖ్యలు తనను బాధించాయని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ అన్నారు. హెరిటేజ్‌ భవనాలను కూల్చడం సరికాదని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని వీహెచ్‌ స్పష్టం చేశారు. హెరిటేజ్‌ భవనాలకు మరమ్మతులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌ అంటేనే అందరికీ చార్మినార్‌ గుర్తొస్తుందని పేర్కొన్నారు. ‘సేవ్‌ హైదరాబాద్‌ కమిటీ’ మహమూద్‌ అలీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్‌ను కూలిస్తే బాబ్రీ ఘటన పునరావృతమవుతుందని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి హెచ్చరించారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చార్మినార్‌ ప్రపంచ వారసత్వ సంపదని, చారిత్రక కట్టడాలను కూలిస్తే జాతి నాశనమవుతుందని ఆయన చెప్పారు. చార్మినార్‌ను కూల్చడం ఎవరితరం కాదని, మహమూద్‌అలీ సోయి తప్పి మాట్లాడుతున్నారు యాదగిరి విమర్శించారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను త్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నిపుణుల కమిటీ సూచన మేరకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి కూల్చివేత వెనకాల..రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.