శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున చేపల పెంపకం

చెరువులను నింపి ముదిరాజులకు ప్రోత్సాహం

పౌల్టీల్రాగా మత్స్య పరిశ్రమను అబివృద్ది చేస్తాం

బండా ప్రకాశ్‌ అభినందన సభలో మంత్రి ఈటెల

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని చెరువుల్లో నీళ్లు నింపి చేపల పెంపకం కోసం ముదిరాజ్‌లకు అవకాశం కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో వెయ్యి చెక్‌ డ్యాంల నిర్మాణం జరుగుతున్నదని, పౌల్టీ పరిశ్రమలాగే మత్స్య పారిశ్రామిక రంగాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. చేప పిల్లల ఉత్పత్తిలో కరీంనగర్‌ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు. నిరుద్యోగులకు రూ.100 నుంచి రూ.200 కోట్లు కేటాయించి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతేలక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని, బీసీల్లో 40 శాతం ఉన్న ముదిరాజ్‌లు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని కోరారు. ముదిరాజ్‌లకు రాజ్యసభ సీటుకు అవకాశం కల్పించడం ఆ కులస్థులకు దక్కిన గౌరవంగా భావించాలని సూచించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు అత్మీయ సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసమే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం లేదని, రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ఆయా వర్గాలను ఆదుకుని పైకి తీసుకుని రావలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్‌ పనిచేస్తున్నారని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీ ఏకు మార్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ఆలస్యమైనా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో ముదిరాజ్‌లకు సముచిత స్థానం దక్కుతున్నదని, ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది 90 కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో రెండుసార్లు చేప పిల్లలు వదులుతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పుట్ట మధు, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ముదిరాజ్‌ సంఘం నాయకులు పోలు లక్ష్మణ్‌, గుర్రాల మల్లేశం, పిట్టల రవిందర్‌, బల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.