షా

ఆరోజు సోమవారం. తిరుపతిలో జాయినై వారం కూడా కాలేదు. గెస్ట్‌హౌస్‌లో మకాం. కోర్టు కాంపౌండ్‌లోనే ఉంది. ఎంకాకాలం. చాలా వేడిగా ఉంది. కరెంట్‌ కూడా లేదు. స్నానం, టిఫిన్‌ అయిపోయినాయి. ఆరు బయట కుర్చీలో కూర్చుని పేపర్‌ చదువుతున్నాను.
ఆరోజు ఉదయం జువెనైల్‌(పిల్లల) కోర్టుకి వెళ్లాల్సి ఉంటుందని అటెండర్‌ గుర్తు చేశాడు. ప్రతి సోమవారం ఉదయం జువెనైల్‌ కోర్టు, చిన్నపిల్లల కేసుల విచారణ. మూడు జిల్లాలకి కలిపి ఒకటే కోర్టు.
తొమ్మిదన్నర కావొస్తుంది. రూంలోకి వెళ్లి రెడీ అయ్యాను. జువెనైల్‌ కోర్టు దక్షిణ మాడ వీధిలోని అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉంది. ఆ సంగతీ అటెండరే చెప్పాడు. కోర్టు టైం ఇంకా ఉన్నా అబ్జర్వేషన్‌ హోమ్‌ని పరిశీలిద్దామని బయల్దేరాను. అటెండర్‌ ముందు, అతని వెనుక నేను. కోర్టు కాంపౌండ్‌ దాటి కుడివైపు తిరిగాము. అక్కడ నుంచి బేరీ వీధికి వెళ్లాం. పేరుకి మెయిన్‌ రోడ్డేకానీ ఆ రోడ్డు ఇరుకుగా చిన్న సందు మాదిరిగా ఉంది. విపరీతమైన రద్దీ. వివిధ వాహనాల రాకపోకలు. రెండు సందులు మారి స్టేట్‌బ్యాంక్‌ పక్క నుంచి ఆర్డీవో ఆఫీస్‌ దాటి కుడివైపు దక్షిణ మాడా వీధిలోకి వెళ్లాం. ఎత్తయిన గుడి గోడలు. చుట్టూ అన్నీ ఇరుకు సందులు. మున్సిపాలిటీ చెత్తంతా రోడ్డు మీదే. పుణ్యక్షేత్రాలన్నీ ఇలాగే.
కొద్ది దూరం నడిచాం. ఆదర్శ హైస్కూల్‌. దానికి కొద్ది దూరంలో బాలుర అబ్జర్వేషన్‌ హోమ్‌ ఒక ఇంటిలో. ఆ ఇల్లు గుడివైపు ముఖం చేసి ఉంది. నిలుపు ఇనుప చువ్వలతో దాని మొఖం ` దాని మీద వ్రేలాడేసిన పాత బోర్డు.
నేరాలు చేసి విచారణలో ఉన్న కుర్రవాళ్లని, రోడ్డు మీద తిరిగే అనాథలని, దిక్కూదివాణం లేని పిల్లలని, తప్పిపోయి దొరికిన పిల్లలని, తల్లిదండ్రుల అదుపు తప్పిన కుర్రవాళ్లని ఉంచే హోమ్‌. అక్కడ బాల్యం నాలుగు గోడల మధ్య బంధించబడుతుంది. సూర్యకాంతి అవసరం లేకుండా పరిగే క్రోటన్‌ మొక్కలా బాల్యం అక్కడ పెంచబడుతుంది. అక్కడ బాల్యం నిఘా నీడలో పెరుగుతుంది.
అటెండర్‌ వెంట ఉన్న నన్ను చూసి సాల్యుట్‌ చేశాడు, తలుపు ముందు నిల్చున్న గార్డు. లోపలికి వెళ్లాం. సూపరింటెండెంట్‌ మా కోసమే వేచి చూస్తున్నట్టున్నాడు. మా రాక గమనించి మాకు ఎదురొచ్చి పరిచయం చేసుకొన్నాడు. అబ్జర్వేషన్‌ హోమ్‌ గురించి వివరించాడు.
కోర్టులనీ, జైళ్లనీ చూశానుగానీ ఇలాంటివి ఎప్పుడూ చడలేదు. అనుభవంలోకి రాలేదు. కొత్త. కుతూహలంగా ఉంది. అతనితో పాటు మేమిద్దరం లోనికి వెళ్లాం. చిన్న సందులా ఉంది. ఎడమవైపున ఆఫీసులాగా చిన్న రూమ్‌. దాటి లోపలికి వెళ్లాం. మధ్యన ఖాళీ స్థలం. చుట్టూ నాలుగ్గదులు. గదుల నిండా కుర్రవాళ్లు. చాలా చిన్న చిన్న కుర్రవాళ్లు. ఆకుపచ్చ డ్రెస్సుల్లో సీతాకోకచిలుకల్లా ఉన్న కుర్రవాళ్లు. అందరూ లేచి ‘నమస్కారం సార్‌’ అన్నారు.
ఆ హోమ్‌లో ఉండాల్సిన సంఖ్య గురించి, అప్పుడు ఉన్న సంఖ్య గురించి, వాళ్లకు ఇస్తున్న భోజనం గురించి, వాళ్లకు నేర్పుతున్న విద్య గురించి అన్నీ వివరించాడు సూపరింటెండెంట్‌. గోడల్ని చూశాను. అన్నీ నీతిబోధల వాక్యాలతో నిండి ఉన్నాయి. ‘అబద్ధాలు చెప్పవద్దు’ లాంటివి. నవ్వొచ్చింది కోర్టులో సాక్ష్యాలు చెబుతున్న వాళ్లు గుర్తుకు వచ్చి. వాళ్ల వంట గదులు వగైరా అన్నీ చూశాం. బాగానే నిర్వహిస్తున్నారనిపించింది. వాళ్లకు ఇస్తున్న ఈమాత్రం భోజనం బయట ఇంట్లో కూడా దొరకదేమో! కానీ బందీగా వుండటం?
పదిన్నర కావొస్తుంది. కోర్టుకి వెళ్దామని చెప్పాను. అటెండర్‌ పైకి దారితీశాడు. ఇరుకైన మెట్లు. అసలే పొడుగైవాణ్ని. జాగ్రత్తగా నడుస్తూ పైకి వెళ్లాను.
అదొక చిన్న హాలు. కోర్టులా కాకుండా మామూలుగా ఉంది. ఇన్‌ఫార్మల్‌గా ఓ కుర్చీ. దానిముందో పెద్ద టేబుల్‌. దాన్ని ఆనుకొని ఎడమవైపున మరో చిన్న టేబుల్‌. దాని మీద కేసు ఫైళ్లు. వాటి పక్కనే బెంచి క్లర్కు. వాటి ముందు రెండు పొడవైన టేబుల్‌ బల్లలు. వాటికి రెండువైపులా కుర్చీలు. మామూలు దుస్తుల్లో ఓ అయిదారుగురు కూర్చొని ఉన్నారు. న్యాయవాదులై ఉంటారు. అది జువెనైల్‌ కోర్టు కాబట్టి అందరూ మామూలు దుస్తుల్లోనే. పోలీసులు కూడా. మామూలు నేరస్తుల మాదిరి కాకుండా వీరిని వేరే రకంగా విచారించాలని, సత్వర న్యాయం పిల్లలకి అందజేయాలని వీటిని ఏర్పరిచారు. కానీ ఆచరణలో మాత్రం అలాంటి అవకాశం లేదు. మూడు జిల్లాలకి కలిపి ఒకే కోర్టు. ఎక్కడెక్కిడి నుంచో సాక్షులూ, బల నేరస్తులూ రావాలి. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రావాలి. న్యాయవాదులు రావాలి. మెజిస్ట్రేట్‌ ఉండాలి. కేసు నడవాలి. దీంట్లో ఎవరూ రాకున్నా కేసు వాయిదా. ఇంత వ్యవహారం!
హాలుకి రెండువైపులా డాబా ` కుర్రవాళ్లు, కొంతమంది ఆడవాళ్లు, మగవాళ్లు కుడివైపు డాబాలో నిల్చొని ఉన్నారు. వాళ్లు ఆ కుర్రవాళ్ల తల్లిదండ్రులు కావొచ్చు. వాయిదాకి ఎక్కడి నుంచో తమ పిల్లల్ని తీసుకొని కోర్టుకి రావాలి. ఎంత దుర్భరం! రాబోయే శిక్ష కన్నా బాధాకరమైనది ఇదేనేమో!
కుర్చీ వెనుక ఓ రూం. గోడపైన నవ్వుతున్న గాంధీ బొమ్మ.
అటెండర్‌ హాల్లోకి వస్తూనే ‘సైలెన్స్‌’ అని చిన్నకేక వేశాడు. అక్కడున్న వాళ్లంతా లేచి నిల్చున్నారు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాను. బెంచి క్లర్కు కేసులని పిలవడం మొదలు పెట్టాడు. కేసులని పిలిచినప్పుడల్లా చిన్న కుర్రవాళ్లు వచ్చి హాల్లో నిల్చుంటున్నారు. ఎక్కువమంది పైన ఉన్నవి దొంగతనం కేసులే. విచిత్రం! పిల్లలు దొంగతనం ఎందుకు చేయాల్సి ఉంటుంది? సరైన పెంపకం, పోషణ లేకపోవడం వల్లనేనా? ఇతరేతర కారణాలున్నాయా? వాళ్లని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు.
సాక్ష్యాలు రాని కేసులని వాయిదా వేసి ఒకటి రెండు కేసుల్లో సాక్షులను విచారించాను. కోర్టు పని పూర్తి కావొచ్చింది. ఒకటిన్నర దాటింది.
అప్పుడు ఓ ముప్పై అయిదేళ్లు దాటిన తల్లి తన కొడుకుతో వచ్చి ఓ పిటీషన్ని అందజేసింది. తన భర్త చనిపోయాడని, ఆ పిల్లవాణ్ని అదుపులో ఉంచలేకపోతున్నాని, వాణ్ని అదుపుచేయడం తనకి సాధ్యం కాలేకపోయిందనీ, అందుకని ఆ కుర్రవాడిని అబ్జర్వేషన్‌హోమ్‌కి పంపించాలని ఆ పిటీషన్‌లోని సారాంశం. ఎవరో న్యాయవాది రాసినట్టుంది ఆ పిటీషన్‌.
ఆ తల్లివంకా, ఆ కుర్రవాడి వంకా చూశాను. ఆమెకి ముప్పై అయిదేళ్లు ఉంటాయి. దీనంగా ఉంది. మాసిన బట్టలు. బక్కచిక్కిన శరీరం, పోషణ లేనట్టుగా ఉంది. బొట్టులేని ఆమె ముఖం సూర్యుడు లేని ఆకాశంలా ఉంది.
వాడి కళ్లు అమాయకంగా, నిర్మలంగా ఉన్నాయి. వాడి చూపులు స్కూల్లో చేరడానికి వచ్చిన కుర్రాడిలా ఉన్నాయి. ఎనిమిదేళ్లు కూడా దాటి ఉండవు. చేతులు కట్టుకొని వినమ్రంగా నిల్చొని ఉన్నాడు. వాడిని చూస్తే అదుపులో ఉంచలేని కుర్రవాడిలా అనిపించలేదు. ఆ పిటీషన్‌లో రాసిన విషయాలు నిజమనిపించలేదు.
ఆ తల్లి నావైపు చూసింది. త్వరగా ఆమె పని అయిపోతే బాగుండనన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు.
ఎదురుగా కూర్చొని ఉన్న ఓ న్యాయవాది లేచి ఆ కుర్రవాణ్ని తల్లి అదుపులో ఉంచలేకపోయిందని, ఆమెకి వాడికి అదుపులో ఉంచడం సాధ్యం కాదని, అందుకని వాడిని అబ్జర్వేషన్‌ హోమ్‌కి పంపించాలని ఆ తల్లి కోరుతోందని వివరించాడు. అతనికి యాభై ఏళ్లుంటాయేమో. ఆ పిటీషన్‌ రాసి ఇచ్చి ఉంటాడు. కుర్రవాడినీ, అతని తల్లినీ విచారించిన తరువాత ఉత్తర్వులు రాస్తానని చెప్పి విచారణ ప్రారంభించాడు.
‘ఏం పేరు బాబు’
‘నాగరాజు’
‘ఏ ఊరు మీది!’
‘కరకంబాడి’
‘ఏం చదువుకొంటున్నావు?’
‘మూడో తరగతి’
‘స్కూలుకెళ్తున్నావా?’
‘వెళ్తున్నాను’
‘ఇక్కడుంటావా’
‘ఉంటాను’
‘ఏం చేస్తావు’
‘చదువుకుంటాను’
(మిగతా వచ్చే బుధవారం)