సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య కారణంగా ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు చేజారుతున్నా వారిని అదిమిపట్టుకుని మాట్లాడే నేత కాంగ్రెస్‌లో లేకుండా పోయాడు.
ఇటీవలి సార్వత్రక ఎన్నికలలోకాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ స్వయంగా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగాలని నిర్ణయించారు. ఆ తరవాత బుజ్జగింపులతో వెనక్కి తగ్గినా అది ప్రముఖంగా ముందుకు రాలేదు. ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఆయన నిర్ణయంతో మొత్తంగా పార్టీనే గందరగోళంలో పడేసింది. ఈ కారణంగా జాతీయస్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిల్లోనూ పార్టీలకు సమర్థ నాయకుడు అన్నది లేకుండా పోయింది.ఓటమి సమసయంలోనే అసలు నాయకత్వం బయటకు వస్తుంది. పార్టీని ఎలా గట్టెక్కించాలన్న వ్యూహం ఉండాలి. ఇప్పుడు ఒక్క తెలంగాణెళి కాకుండా అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటకలో కూడా సంక్షోభాలు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ రాజీనామాను ఆమోదించడం లేదు. అలాగే రాష్ట్రాల్లో సంక్షోభాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికల పక్రియ ద్వారా ప్రజామోదం పొందిన రాజవంశంగా నెహ్రూ కుటుంబం ఇంతకాలం వర్ధిల్లింది. 1970 దశకం లో ఇందిరాగాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీని పప్రథమంగా రాజకీయాలలోకి తీసుకువచ్చారు. భావి ప్రధానిగా పేరు పొందిన సంజయ్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ తరువాత, రాజకీయాలలోకి రావడానికి సుముఖంగా లేని పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని బలవంతంగా రాజకీయాల లోకి తీసుకువచ్చారు. అలా ఆ ఒక్క కుటుంబంతో కాంగ్రెస్‌కు పేగుబంధం నెలకొన్నది. ఇది కొంతవరకు ప్రజల ఆమోదం పొందినా తరవాతి కాలంలో దానికి పెద్దగా ఆమోదం దక్కలేదు. మొన్నటి యూపి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది అదికూడా రాయబరేలీలో సోనియా గెలుపు మాత్రమే. కాంగ్రెసేతర నేతలు అధికారంలో ఉన్నా పార్టీ పెద్దగా రాణించలేదు. పివి నరసింహారావు 1991-96 సంవత్సరాల మధ్య ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు. ఆయన ప్రభుత్వం మనుగడను కాపాడుకున్నా, అదే సమయంలో కాంగ్రెస్ ప్రతిష్ట బాగా దిగజారిపోయింది. పార్టీలో చీలికలు కూడా సంభవించాయి. నరసింహారావు అనంతరం సీతారామ్ కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినా , కేసరిని రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి చాలా అనాగరికంగా తొలగించారు. సోనియా పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపిఎ పదేళ్లు పాలన సాగించినా కుంభకోణాలతో ప్రజల్లో భ్రష్టుపట్టింది. ఇదంతా సమర్థ నాయకత్వం లేని కారణంగానే కేంద్రంలోనే దిక్కూదివాణం లేకుండా ఉన్న కాంగ్రెస్ ఇప్పడు రాష్ట్రాల గురించి ఆలోచించే స్థితిలో లేదు. అందుకే తెలంగాణ పరిణమాలపై అది పెద్దగా పట్టింపు లేకుండా ఉంది. ఎపసిలో అయితే ఆలోచించే స్థితిలో కూడా లేరు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మూడు సీట్లు గెల్చుకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షుగా మారింది. బలహీన నాయకత్వం.. సమన్వయం లేకపోవడం.. కొత్త తరాన్ని పాత నాయకత్వం ఎదగనీయకపోవడం వంటి కారణాలు ఓ వైపు, పట్టింపు లేని ధోరణి.. పలుకరించే నేతలు కరువైపోవడం వంటివి మరోవైపు వెరసి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. వారిలో 12 మంది అధికార పార్టీ కండువాలు కప్పుకోవడంతో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష¬దా గల్లంతైంది. శాసనమండలి విలీనం తర్వాత శాసనసభ విలీనం దిశగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతున్నా, ఢిల్లీ నాయకత్వం చూసీచూడ నట్లే వ్యవహరించడం, లోక్‌సభ ఎన్నికల వ్యవహారాల్లో పార్టీ సీనియర్లు బిజీగా ఉండటంతో గతంలో
ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరుగురు సభ్యులకే పరిమితం కావాల్సిన దుర్గతి ఏర్పడింది. ఇందులోనూ ఎందరు ఉంటారో, ఎందరు పార్టీ వీడతారో తెలియని అయోమయంలో కాంగ్రెస్ కొట్టుమిట్టా డుతోంది. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గ్రామస్థాయి నేతలను పట్టించు కున్న నాథుడే లేడు. దీంతో మరికొందరు కార్యకర్తల ఒత్తిడితో పార్టీలు మారారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధినేతలు బిజీగా ఉండటం, ఎమ్మెల్యేలకు వారి అపాయింట్‌మెంట్‌లే దొరక్క పోవడంతో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో సమన్వయం లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అలిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు లేకపోవడంతో రేగ కాంతారావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో తన కుమారుడికి బదులుగా టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారు. కొందరు ఎస్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని సంకేతాలు ఉన్నప్పటికీ, వారితో చర్చించి ఆపడంలో పార్టీ పూర్తిగా విఫలమైంది. జాజాల సురేందర్, చిరుమర్తి లింగయ్య వంటి వారు పార్టీ మారుతున్నా, వారి ఇంటికి వెళ్లి బుజ్జిగించిన యత్నాలేవీ చేయలేదు. అయితే ఇదొక్క తెలంగాణలో మాత్రమే జరగడం లేదు. రాజస్థాన్, గుజరాత్, కర్నాటకల్లో కూడా సాగుతోంది. ఇదంతా సమర్థ నాయకత్వ లోపంగా గుర్తించాలి. దీనిపై కాంగ్రెస్ ఏ రకంగా ముందుకు సాగుతుందన్నది చూడాలి. అయితే పరాజయాలతో కుంగిపోకుండా పార్టీలను నడపడం సమర్థ నేతకు మాత్రమే సాధ్యం.