సంయమనం పాటించాల్సిన సమయమిది
తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొద్దిరోజులుగా సాగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో కొంత కదలిక రాగానే దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం ఇక్కడి వారే సహకారాన్నే తీసుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు సీమాంధ్ర పెట్టుబడీదారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తెలంగాణపై కదలిక రావడం, ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెలరోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. అఖిలపక్ష సమావేశంలోనూ కాంగ్రెస్ తరుపున సీమాంధ్ర ప్రాంతం నుంచి హాజరైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గాదె వెంకటరెడ్డిని షిండే మాట్లాడనివ్వలేదు. తెలంగాణ నుంచి వచ్చిన సురేశ్‌రెడ్డి అభిప్రాయం మాత్రమే తీసుకున్నారు. అఖిలపక్షం తర్వాత ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్‌అల్వీ మీడియాతో మాట్లాడుతూ షిండే చెప్పింది కాంగ్రెస్ పార్టీ వైఖరేనని తెలిపారు. సోనియాగాంధీ నేతృత్వంలో ఇప్పటికే పార్టీ ముఖ్యులు రెండుసార్లు భేటీ అయి తెలంగాణ ఏర్పాటుపై చర్చించారు. లేదంటే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపైనా మధింపు చేశారు. ఇవన్నీ మింగుడు పడని కొన్ని స్వార్థ సీమాంధ్ర శక్తుల కుట్రల ఫలితమే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు. సమస్త ముస్లింలకు తామే ప్రతినిధిగా ప్రకటించుకునే ఎంఐఎం పార్టీ ముఖ్య నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికం. కేవలం పాతబస్తీ రాజకీయాలకే పరిమితమైన పార్టీ సమస్త ముస్లింకు ప్రతినిధిగా చెప్పుకోవడమే సరికాదు. ప్రజల్లో ఆదరణ లేకుండా రాజకీయాలు నడుపలేమని భావించే వారిని రెచ్చగొట్టేందుకు అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. దీనిని రాజకీయ వేదికగా ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు తెలంగాణ సమస్యను పక్కదారి పట్టించేలా కొత్త సమస్యను సృష్టించడం ఆయన ఉద్దేశం. ప్రజలు కొట్టుకుచచ్చేంతగా శాంతిభద్రలకు విఘాతం కలిగించడమే వారి లక్ష్యం. ఇది మొదటిసారే కాదు.. ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. 1991లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని పదవినుంచి తొలగించడానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన అప్పటి ముఖ్య నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుట్ర పన్నారు. పాత బస్తీకి చెందిన కొందరు మతోన్మాదులు అగ్ని ఆజ్యం పోశారు. ఫలితంగా హైదరాబాద్ నగరం కొద్ది రోజులు రణరంగాన్ని తలపించింది. కానీ అన్నదమ్ముల్లా అంతకుముందు రోజు వరకు కలిసి మెలిసి జీవించిన హైదరాబాదీలు కుట్రలను త్వరగానే పసిగట్టారు. ఉన్మాదుల ప్రేలాపనలు పక్కనబెట్టి సామస్యంతో మళ్లీ జీవనం సాగించడం మొదలు పెట్టారు. దానితాలూఖూ కొన్ని విషాద సంఘటనలు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నా ఉన్మాదులు ప్రకటించినట్లుగా హైదరాబాదీల మధ్య విద్వేశాలైతే లేవు. అలాంటి పరిస్థితే ఉంటే ఒకరినొకరు తెగనరుక్కుని మొత్తానికి మొత్తం ఒక వర్గం అంతరించిపోవడమో, ఇరు వర్గాల్లో కొద్దిపాటి మంది మిగలడమో జరగాలి. కానీ హైదరాబాద్‌లో ఆ కొన్ని రోజులు మినహా మళ్లీ ఎప్పుడూ అలాంటి వాతావరణం కనిపించలేదు. నగరంలోని పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు సాగించే శక్తులే అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కల్పించడానికి ప్రయత్నించడం కొవ్వొత్తి కరిగిపోయినట్టుగా త్వరగానే ఆ పరిస్థితి మారుపోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తెలంగాణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్న పార్టీకి భవిష్యత్ ఉండకపోవచ్చు. ఇందుకోసమే ఆ పార్టీ తెలంగాణ వస్తే హిందువులు బలపడతారంటూ ముస్లింలలో భయాందోళనలు సృష్టిస్తోంది. మరో పార్టీ, కొన్ని వర్గాలు హైదరాబాద్ ఐఎస్‌ఐకి రాజధానిగా మారుతుందని, ముస్లిం తీవ్రవాదం పెరుగుతుందంటూ అభద్దాలు చెప్తూ ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారు. మరికొందరు హైదరాబాద్ మావోయిస్టులకు అడ్డాగా మారుతుందంటున్నారు. అంటే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడమే వారి వ్యూహం. వారి ప్రచారం నిజం కావాలంటే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరగాలి. ఇందుకోసం వర్గవైశమ్యాలు రెచ్చగొట్టాలి. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలి. ఎవరు ఎంతగా ప్రయత్నించినా సంయమనం పాటించాలి. తెలంగాణ ప్రజలంతా అన్నాదమ్ములని ఎలుగెత్తి చాటాలి. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా, వెకిలి చేష్టలు చేసినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా నిగ్రహంగా ఉండాలి. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.