సబ్‌ప్లాన్‌కు ఆమోదం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణల తీర్మానం వీగిపోయింది. బిల్లు ఆమోదం పొందగానే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కోసం మూడు రోజుల పాటు నిర్వహించిన శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. బిల్లులో కొత్తదనం ఏమి లేదని సవరణలు చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. ఎస్సీ వర్గీకరణ ప్రకారమే సబ్‌ ప్లాన్‌ నిధులు ఖర్చు చేయాలని డిమాండ్‌ చేసింది. బిల్లులో 12 సవరణలు చేయాలని డిమాండ్‌ చేయగా స్పీకర్‌ ఓటింగ్‌కు అనుమతించారు. ఆ సమయంలో సభకు 178 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. సభలో ఉన్న 116 మందిలో సవరణల తీర్మానానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 69 ఓట్లు వచ్చాయి. దీంతో తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఓటింగ్‌ సమయంలో మంత్రులు రఘువీరారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి సభలో లేరు. అయితే సవరణల బిల్లును స్పీకర్‌ ఓటింగ్‌కు అనుమతించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఈ నేపథ్యంలో ఓటింగ్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. అయినా సభలో స్పీకర్‌ నిర్ణయమే అంతిమమని, ఆయనను గౌరవిస్తామని పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌కు శాసనసభ ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు కుట్రపన్నాయని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయినా చివరికి తామే విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఓటింగ్‌ సమయంలో పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు సభకు గైర్హాజరుకావడంతో ముఖ్యమంత్రి కలవరపాటు కనిపించింది. ఏం జరుగుతుందోనని ఆయన ఆందోళన చెందారు. ఓటింగ్‌ కోసం పార్టీ ఎలాంటి విప్‌ జారీ చేయలేదు.