దిలావర్‌పూర్ ‘ఇథనాల్’ రద్దు.. దిల్‌దార్ నిర్ణయం
` ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పు ఇథనాల్ రద్దు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమౌతుంది
` పెద్ద ధన్వాడ, చిత్తనూరులోనూ తొలగించాలని భారీగా డిమాండ్లు
` కాలుష్య పరిశ్రమలపై ప్రజాప్రభుత్వ ఆదేశాలు హర్షణీయం
` ‘ప్రజాపాలన’ను స్వాగతిస్తున్న రైతులు, గ్రామాలు, మేధావులు
సమస్త ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ఇథనాల్ పరిశ్రమలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భావితరాలను దృష్టిలో పెట్టుకుని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ప్రోత్సహించబోమని ఇదివరకే స్పష్టంచేసిన ప్రభుత్వం.. తాజాగా దిలావర్‌పూర్‌పై తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ప్రజలు, యువత సంబరాల్లో మునిగితేలుతుండగా.. సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మేధావులు, విద్యావంతులు సైతం స్వాగతిస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో కొనసాగిన ఆందోళనలకు ‘ప్రజాపాలన’లో సానుకూల వాతావరణం ఏర్పడటం, ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం వ్యవహరించడం, ప్రకృతిని పాడుచేసి మానవ మనుగడకు కీడుచేసే ఇథనాల్ పరిశ్రమల రద్దు వంటి చర్యలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతాయని భావిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 28 (జనంసాక్షి)
శాంతియుత పద్ధతుల్లో దాదాపు నాలుగు నెలలకుపైగా ఆందోళనలు చేపడుతున్న పల్లెలు ఇథనాల్ మహమ్మారి వద్దంటే వద్దంటూ నినదించాయి. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా నిరంతరాయంగా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడారు. హావిూలిచ్చి మొహంచాటేసిన ప్రజాప్రతినిధులను నిర్ద్వంద్వంగా నిలదీశారు. రోజుకో ఊరూ, రోజుకో వాడా టెంటు కింద కూర్చొని ఇథనాల్ వ్యతిరేక గళం వినిపించారు. విత్తనాలు, పండ్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని నమ్మించి మోసగించారని, పదేపదే హావిూలిచ్చి అధికారులు, నాయకులు సైతం కనబడకుండా పోయారని ఆగ్రహించారు. దీంతో వేలాదిమంది జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ మహాధర్నాలో మహిళలు ముందుండి పోరాడారు. శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నవారిలో రైతులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయడంపై మరింత మండిపడ్డారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. రాష్ట్రం మొత్తం దిలావర్‌పూర్‌వైపు చూసేలా పోరాటాన్ని ఉధృతం చేశారు. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించడం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. రెండోరోజే ప్రజానుకూల నిర్ణయం వెలువడటంతో దిలావర్‌పూర్ దిల్‌కుష్ అయ్యింది. ఇథనాల్ పరిశ్రమ రద్దు సూత్రపాయంగా అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, మేధావి వర్గం, పల్లె ప్రజానీకం స్వాగతించింది.
ప్రమాదకరంగా అనాలోచిత అనుమతులు
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని పలుచోట్ల ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు లభించాయి. ఈ కంపెనీల్లో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, వారి కుటుంబాలు పెట్టుబడులు పెట్టాయి. యువతకు ఉపాధి, రైతులకు వసతులు లభిస్తాయని మభ్యపెట్టి, ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఈ పరిశ్రమలను స్థాపించేందుకు పెట్టుబడిదారులు గుట్టుగా పావులు కదిపారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులో నిర్మించిన భారీ ఇథనాల్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యాన్ని దిలావర్‌పూర్ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ తెలుసుకుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను వాగుల్లో కలపడం వల్ల నీటి కాలుష్యం, చేపల మృత్యువాత, పంటలు దిగుబడి తగ్గడం, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం వంటి పరిణామాలను ప్రత్యక్షంగా వీక్షించారు. నీటి వనరులు, ప్రాజెక్టులు కూడా కలుషితబారిన పడుతున్నాయని, ఆహార ధాన్యాలను పెద్దమొత్తంలో ఫ్యాక్టరీ కోసం ఉపయోగిస్తున్నారని గుర్తించారు. వ్యవసాయ పంటలకు అందే నీటిని కూడా పెద్దమొత్తంలో ఫ్యాక్టరీ కోసం వినియోగించసాగారు. ఈ నేపథ్యంలోనే దిలావర్‌పూర్‌లో ప్రజలు ఐక్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకు పట్టుబట్టారు. పూర్తిస్థాయిలో ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభమైతే భవిష్యత్తే లేకుండా పోతుందని భావించారు. దిలావర్‌పూర్ మండల ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ఫలితం సాధించారు.
పెద్ద ధన్వాడ, చిత్తనూరు నుంచి భారీగా డిమాండ్లు
నారాయణపేట జిల్లా చిత్తనూరులో రెండేండ్ల క్రితం పనులు ప్రారంభించి, పూర్తిచేసిన ఇథనాల్ ఫ్యాక్టరీ దుష్పరిణామాలను తెలంగాణ సమాజం మొత్తం గుర్తించింది. అందుకే ఏడాదికిపైగా అక్కడ ఆందోళనలు కొనసాగాయి. ఇప్పటికీ ఆ పరిశ్రమను తొలగించాలని ప్రజలు పట్టుబడుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలు వెలుస్తున్న ప్రాంతవాసులు ముందుగా చిత్తనూరును అధ్యయనం చేసి తిరగబడుతున్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతోంది. పదుల సంఖ్యల్లో గ్రామాలు కాలుష్యంతో విలవిలలాడుతున్నాయి. గత నెలన్నర క్రితం గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో గుట్టుగా ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించడాన్ని స్థానికులు గుర్తించి తిరగబడ్డారు. పలుమార్లు కంపెనీ యాజమాన్యం మాటతప్పి, అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. దీన్ని రైతులు, సవిూప గ్రామాల ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టారు. నిత్య పోరాటాలకు దిగారు. గ్రామాలవారీగా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతాంగమంతా కలిసికట్టుగా నడుంబిగించి ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఒక ఏడాది పంటలు నష్టపోయినా ఫర్వాలేదుగానీ ఫ్యాక్టరీని ఇక్కడినుంచి రద్దు చేసేదాకా పోరుబాట చేస్తామని భీష్మిస్తున్నారు. తాజాగా దిలావర్‌పూర్ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడటం, ఇటీవలే కాలుష్య పరిశ్రమలను అనుమతించబోమని ముఖ్యమంత్రి వెల్లడిరచిన దరిమిలా పెద్ద ధన్వాడ, చిత్తనూరు రైతాంగం, ప్రజానీకం, స్థానిక పల్లెలు కూడా ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నాయి.