కలుషిత ఆహారంలో కుట్రకోణం
` త్వరలో బయటపెడతాం
` బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: మంత్రి సీతక్క
హైదరాబాద్(జనంసాక్షి):హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. దీనిపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అవసరమైతే అధికారులను సర్వీసు నుంచి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు.కాగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమకు వాటాలున్నాయని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వాటాలున్నాయని నిరూపిస్తే వాళ్లకే రాసిస్తానని చెప్పారు. ఇథనాల్ కంపెనీ వద్దని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారని, దానిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారని, 2016లోనే దానికి రాజీనామా చేశాడన్నారు. అదే ఏడాది ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీలో ఒప్పందం కుదిరిందని, ఆ తర్వాత దానిని రద్దు చేసుకున్నారని తెలిపారు. పాత పేపర్ పట్టుకుని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. దానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసిందన్నారు. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని చెప్పారు. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తామని తలసాని చెప్పారు. రేపు ఉదయం నిమ్స్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు బసవతారకం కేన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ దీక్షా దివస్ నిర్వహిస్తామని వెల్లడిరచారు. వేల మంది గులాబీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. భారాస హయాంలోనే నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. ఈవిషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే పరిశ్రమకు అనుమతులు ఎవరు ఇచ్చారో మాట్లాడదామని.. దిలావర్‌పూర్ రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో గాంధీభవన్ వద్ద సీతక్క విూడియాతో మాట్లాడారు.’’భారాస హయాంలో ఎన్నో పరిశ్రమలకు కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా అనుమతులు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లక్షల ఎకరాల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం గ్రామసభల్లో ఒకరిద్దరిని రెచ్చగొట్టి అధికారుల పైకి ఉసిగొల్పుతున్నారు. ఇథనాల్ పరిశ్రమలో డైరెక్టర్‌గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు ఏపీకి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఉన్నారు. ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చే సమయానికి మరో డైరెక్టర్‌గా తలసాని కుమారుడు సాయి ఉన్నారు. కేటీఆర్.. ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు?ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దాం. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేలుద్దాం. విూ హయాంలోనే పరిశ్రమకు అనుమతులు ఇచ్చినట్లు ఇప్పటికైనా ఒప్పుకోండి. ఈ అంశంపై ఆధారాలతో సహా త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తాం. అసెంబ్లీలో దీనిపై చర్చ పెడతాం. తప్పుడు ప్రచారాలతో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరు’’ అని సీతక్క మండిపడ్డారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు
కారణాలు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
హైదరాబాద్(జనంసాక్షి): ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది.పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి, ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.