సమాచారం శరవేగం

C

– జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం

– ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని

నెల్లూరు, ఆగష్టు 27 (జనంసాక్షి):

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. సమాచార రంగంలో కొత్త శకానికి తెరలేపింది. ఎస్‌ బ్యాండ్‌ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలు అందించే లక్ష్యంతోరూపొందించిన జీశాట్‌-6 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ6 వాహక నౌక ద్వారా ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగించారు. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని వాహన నౌక లక్ష్యాన్ని చేరుకుని,  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జీశాట్‌-6 ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించగానే ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అభినందించుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి సత్తా చాటినట్లయింది.దీనిపై శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినదంనలు అందాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన దేశీయ క్రయోజనిక్‌ ఇంజన్‌ జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌లో ఉన్న రెండవ ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 4.52 గంటలకు శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఇది ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.  రాకెట్‌ ప్రయోగానికి మొత్తం రూ. 250 కోట్లు ఖర్చయింది. ఇందుకోసం బుధవారం ఉదయం 11.52 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఈ రాకెట్‌ ద్వారా దేశ కమ్యూనికేషన్‌ రంగానికి 12 సంవత్సరాలపాటు విశేష సేవలను అందించే 2,117 కిలోల జీశాట్‌-6 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్లారు. ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ బుధవారమే  షార్‌కు చేరుకుని, ప్రయోగ సన్నాహాలను పర్యవేక్షించారు.  49.1 విూటర్ల ఎత్తు, 416 టన్నుల బరువు (ఉపగ్రహంతో) కలిగిన జీయోసింక్రజన్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)డీ6 రాకెట్‌ నాలుగు బూస్టర్లు, మూడు దశల ఇంజన్‌లతో 17.04 నిమిషాలు అంతరిక్షంలో ప్రయాణించి 214.35 కిలోవిూటర్లు ఎత్తుకు చేరుకోనుంది.

భారత సమాచార ఉపగ్రహాలలో 25వది అయిన జీశాట్‌-6 దేశంలో నిర్మించిన సమాచార ఉపగ్రహాలలో 12వది, జీశాట్‌ ఉపగ్రహంలో సమాచార సేవలను అందించే 10 ఎస్‌బ్యాండ్‌, సీబ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు పొందుపరిచారు. ఇస్రో అభివృద్ధి పరచిన యాంటీనాలలో అత్యంత పెద్దదైన 6 విూటర్ల యాంటీనా ఈ ఉపగ్రహంలో ఏర్పాటు చేశారు. ఇది కక్ష్యలోకి ఉపగ్రహం చేరుకున్న తదుపరి విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఈ యాంటీనా ద్వారా ఎస్‌బాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు దేశాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని మల్టీవిూడియా, శాటిలైట్‌ ఫోన్‌లకు తమ సేవలను అందించనున్నాయి. దీర్ఘవృత్తాకారపు కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-డీ6 చేర్చిన తదుపరి కర్ణాటకలోని మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ కేంద్రం ఈ ఉపగ్రహాన్ని అంచలంచెలుగా నియంత్రించి భూమధ్య రేఖకు 36 వేల కిలోవిూటర్లు దూరం ఉండే వృత్తాకారపు భూస్థిర కక్ష్యలోకి చేరవేయనుంది. ఈ ఉపగ్రహం యాంటీనా పూర్తిగా విచ్చుకున్న తరువాత తన సేవలను అందించడం ప్రారంభిస్తుంది.

ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్‌

జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. జీశాట్‌-6 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ డీ6 రాకెట్‌ దానిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ డీ6లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయన్నారు. స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనితీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. ఈ ప్రయోగంలో భాగస్వామ్యులైన శాస్త్రవేత్తలను అందరినీ ఆయన అభినందించారు. జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్వీ) వాహనౌక శ్రేణిలో తొమ్మిదవది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.  జీఎస్‌ఎల్వీ డి-6ను శ్రీహరి కోటలోని రెండో లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి నింగిలోకి పంపారు.  జీఎస్‌ఎల్వీ-డి6 మోసుకువెళ్లే ఉపగ్రహాల మొత్తం బరువు 2117 కేజీలు అని వివరించారు.  సమాచారం మరింత త్వరగా తెలుసుకునేందుకు ఉద్దేశించిన

రెండు ఉప గ్రహాలను నింగిలోకి పంపారు.  ప్రాథమిక కక్ష్య నిర్థరణ, రాకెట్‌ గమనం లాంటి వాటిని ఎస్‌ బ్యాండ్‌ టెలిమెట్రీ, సీ బ్యాండ్‌ ట్రాన్స్‌ పాండర్ల ద్వారా గమనించారు.  ఇప్పటి వరకు 24 సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. జీశాట్‌-6 25వది. ఇస్రో తయారీలో 12వ ఉపగ్రహం.

స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనితీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. జీఎస్‌ఎల్వీ డీ6 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. జీశాట్‌-6 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.