సర్కారు మాట తప్పింది

మా తెలంగాణ మాకిప్పించండి
ప్రజా కోర్టులో ఆకట్టుకున్న వాదనలు
హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :
సర్కారు మాటతప్పింది. తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించి వెనక్కు పోయింది. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు యువత ఆత్మ బలిదానాలు చేశారు. అమరుల త్యాగాల ప్రతిఫలంగా మా తెలంగాణ మాకిచ్చేయాలని తెలంగాణవాదులు కోరారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగించిన దమనకాండపై టీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ వెటర్నరీ హాల్‌లో ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కారు, పోలీసులు వ్యవహరించిన తీరు, సాగించిన అరెస్టులు, ముందస్తు బైండోవర్లు, పోలీస్‌ పికెట్లపై పలువురు తెలంగాణవాదులు ఆసక్తికరమైన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ తెలంగాణవాదులు, ఉద్యమకారులు, ప్రజల మర్మాంగాలపై పోలీసులు దాడి చేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. టీ జేఏసీ అనివార్య పరిస్థితుల్లోనే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టే తాము ప్రజాస్వామిక ఆందోళనకు దిగినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిరసన తెలిపే అవకాశం కూడా లేనట్లుగా సీమాంధ్ర సర్కారు వ్యవహరించిందని అన్నారు. ధర్నాలకు అనుమతి కోరితే సంఘ విద్రోహ శక్తుల పేరు చెప్పి సర్కారు తప్పుకుంటోందని అన్నారు. జేఏసీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాకోర్టు నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని కోదండరామ్‌ చెప్పారు. ప్రజాకోర్టు న్యాయమూర్తులుగా హెచ్‌ఆర్సీ మాజీ న్యాయమూర్తి ఇస్మాయిల్‌, న్యాయశాస్త్ర అధ్యాపకుడు మాడభూషి శ్రీధర్‌, జర్నలిస్ట్‌ టంకశాల అశోక్‌ వ్యవహరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.