సింగిల్స్‌లో నిరాశే డేవిస్‌కప్‌ పోరులో కొరియాపై భారత్‌ వెనుకంజ

న్యూఢిల్లీ ,ఫిబ్రవరి 1  (): డేవిస్‌కప్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు సంచలనాలేవిూ సృష్టించలేదు. ప్రత్యర్థులకు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశారు. ఏషియా ఓషియానా గ్రూప్‌ టైలో కొరియాతో జరిగిన సింగిల్స్‌ మ్యాచ్‌లలో భారత్‌కు పరాజయాలే ఎదురయ్యాయి. తిరుగుబాటుతో సీనియర్ల స్థానంలో ఎంపిక చేసిన కొత్త కుర్రాళ్ళు విఎం రంజిత్‌ , విజయంత్‌ మాలిక్‌ సునయాసంగానే ఓడిపోయారు. తొలి మ్యాచ్‌లో రంజిత్‌ 1-6 , 0-6 , 1-6 తేడాతో పరజాయం పాలయ్యాడు. గంటా 23 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రంజిత్‌ కేవలం రెండే గేములు గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో విజయంత్‌ మాలిక్‌ మాత్రం కాస్త పోరాటపటిమ కనబరిచినా… గాయంతో ముందే తప్పుకున్నాడు. మాలిక్‌ 4-6 , 5-7 , 0-3 తో ఉండగా… అతని ఎడమకాలి కండరాలు పట్టేశాయి. దీంతో కొరియా ఆటగాడినే విజేతగా ప్రకటించారు.ఇక మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌లలోనూ గెలిస్తేనే భారత్‌ విజయం సాధిస్తుంది. రేపు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సీనియర్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్‌-పురవ్‌ రాజా , యంగ్‌-సుంగ్‌ జోడీతో తలపడనున్నారు.ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఏకైక టాప్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్‌ ఒక్కడే. ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌కూ , టాప్‌ ప్లేయర్స్‌కూ మధ్య వివాదం నెలకొనడంతో అందరూ తిరుగుబాటు చేశారు. వారిలో సోమ్‌దేవ్‌దేవ్‌వర్మన్‌ , మహేశ్‌ భూపతి , రోహన్‌ బోపన్న కూడా ఉన్నారు. వారి డిమాండ్లకు అసోసియేషన్‌ తలొగ్గకపోవడంతో వివాదం అలాగే ఉంది. దీంతో ఎఐటిఎ డేవిడ్‌కప్‌ పోరుకు ద్వితీయ శ్రేణి జట్టునే ఎంపిక చేశారు.