సిరిసిల్లలో కంకర టిప్పర్‌ బీభత్సం

టూవీలర్‌ను ,బస్సును ఢీకొట్టిన టిప్పర్‌

ఒకరు మృతి..పలువురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల,జూన్‌8(జ‌నం సాక్షి): సిరిసిల్ల బైపాస్‌ రోడ్‌ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ద్విచక్రవాహనంను ఢీకొట్టి, అనంతరం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. టిప్పర్‌ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సిరిసిల్ల మండలం రగుడు గ్రామశివారులో కంకర తీసుకెళ్లుతున్న టిప్పర్‌ అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సత్తిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందడంతో పాటు మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి, అతని తల్లి ఎల్లవ్వ ద్విచక్రవాహనంపై సిద్దిపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. రగుడు గ్రామ శివారులో బావుపేట నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ అతివేగంగా బైక్‌ను డీకొట్టింది. అంతటితో ఆగకుండా హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవానం నడుపుతున్న సత్తిరెడ్డి తలకు తీవ్రగాయమైంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి తల్లి ఎల్లవ్వ తీవ్రంగా గాయపడింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొదురుపాకకు చెందిన రాణి, జక్కపూర్‌కు చెందిన రాములు, సిద్దిపేట జిల్లా మాయాపూర్‌కు చెందిన పిట్ల రాజు, ఆర్టీసీ డ్రైవర్‌ కొమురయ్య, టిప్పర్‌ డ్రైవర్‌ కార్తిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.