సిరిసిల్ల పరిసర ప్రజలకు మంచి నీటి కష్టాలు
సిరిసిల్ల,మే2( జనం సాక్షి): చేసే సిరిసిల్ల పురపాలక సంఘం ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుంది. ఎత్తైన ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా కుళాయిల ద్వారా నీటిసరఫరా ఆశించిన మేర జరగడం లేదు. అధికారులు, పాలకవర్గం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వేసవికాలంలో కుళాయిల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పట్టణంలో తాగునీటి సమస్య మొదలైంది. పట్టణంలోని ప్రజలకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్ల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడం లేదు. అనేక ప్రాంతాల్లో నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. స్థానికులకు సరిపడా నీటిని సరఫరా చేయడంలేదు. ఆ ప్రాంత ప్రజలు ఇళ్లముందు డ్రమ్ములను పెట్టుకొని ట్యాంకర్ల కోసం పడిగాపులు పడుతున్నారు. సమయానుకూలంగా నీటి సరఫరా లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి కుళాయిలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తున్నా ప్రభుత్వం ఆశించిన మేర నీటిని సరఫరా చేయడంలో విఫలమైందని స్థానికులు అంటున్నారు. ఐదేళ్ల క్రితం ఎల్‌ఎండీ నుంచి పైపులైన్ ద్వారా సిరిసిల్లకు తాగునీటిని అందించే ప్రయత్నం చేయగా పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. పైపుల్లో నాణ్యత లోపం కారణంగా అవి నీటి సరఫరా ఒత్తిడికి తట్టుకోలేక తరచూ లీకేజీలకు గురవుతున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో రెండు మంచినీటి ట్యాంకులు నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలు కుళాయిల ద్వారా నీటిని వినియోగించు కునేవారు. అలాంటి చర్యలను అధికారులు చేపట్టడం లేదు. దిగువ మానేరు నుంచి సిరిసిల్ల పట్టణానికి నీరందించేందుకు ఏర్పాటు చేసిన పథకం తరచూ మరమ్మతులకు గురికావడం తో సిరిసిల్ల ప్రజలు ప్రతీరోజు దిగువ మానేరు నీటిని వాడుకోలేక పోతున్నారు. ఒక్కో ప్రాంతానికి రెండు రోజులకోసారి చొప్పున నీటి ట్యాంకర్లు వస్తున్నాయి. పాలకవర్గ సభ్యులు, అధికారులు పట్టణంలో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్‌ఎండీ నుంచి వచ్చే నీటికి సంబంధించిన పైపుల లీకేజీలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపడితే ఈ వేసవిలో కొంతవరకైనా నీటి సమస్య గ్టటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.