సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాల్సిందే…

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెష్టిగేషన్‌ (సీబీఐ)కు ఎట్టకేలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ఒక్కడుగు ముందుకు పడింది. అర్ధశతాబ్దపు సీబీఐ చరిత్ర మొత్తం అధికార పక్షానికి జీ హుజూర్‌ అన్నట్టుగానే సాగిందనే చెప్పాలి. దీనిపై గతంలో సుప్రీం కోర్టు కన్నెర్రజేసి సీబీఐకి స్వయం ప్రతపత్తి కల్పించాలని ఆదేశించింది. ఈ చర్యలకు కారణం సీబీఐ ప్రస్తుత డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా అనే చెప్పాలి. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో జరిగిన భారీ అవకతవకలపై సీబీఐ జరిపిన నివేదికను సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు అందజేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వంతో పంచుకున్నట్లు ఆయన సుప్రీం కోర్టుకు నివేదించారు. సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, అటార్ని జనరల్‌ పరిశీలించారని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌ నివేదికను చదివి కొన్ని మార్పులు చేయాలంటూ సూచించారని, ఆయన ఆదేశాల మేరకు నివేదికలో మార్పులు చేసినట్లు స్కూల్‌ పిల్లాడి మాదిరి సమాధానమిచ్చాడు. ఆయన నివేదికతో ఆగ్రహించిన సుప్రీం కోర్టు సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించి తీరాల్సిందేనని పట్టుబట్టింది. దీనికి సంబంధించిన చర్యలు కేంద్రం చేపట్టకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. సీబీఐ డైరెక్టర్‌నూ, కేంద్ర న్యాయశాఖ మంత్రినీ ఈ సందర్భంగా కడిగి పారేసింది. కేంద్రం చేతిలో సీబీఐ బందీ అయిందని, పంజరంలో బందీ అయిన చిలుకకూ, సీబీఐకి పెద్దగా తేడా ఏమి లేదని వ్యాఖ్యానించింది. 1963 ఏప్రిల్‌ 1న పురుడుపోసుకున్న సీబీఐ దేశవ్యాప్తంగా నాలుగు రీజియన్లు, 52 శాఖల ద్వారా సేవలందిస్తోంది. ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సీబీఐ అనుబంధంగా పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దీనిపై సుప్రీం కోర్టు 15 ఏళ్ల క్రితమే స్పందించింది. సీబీఐని స్వతంత్ర సంస్థగా మార్చాలంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి వినీత్‌ నారాయణ్‌ తీర్పునిచ్చారు. ఒకటిన్నర దశాబ్దాలు గడిచినా ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. అదే సమయంలో సీబీఐ దర్యాప్తు చేసిన పలు కేసులు ఏటూ తేలకపోవడం, ఏళ్ల తరబడి దర్యాప్తు చేసినా దోషులెవరో తేల్చకపోవడం, రాజకీయ ఒత్తిళ్లతో కేసు పక్కదారి పట్టడం తదితర కారణాలతో సీబీఐపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. బోఫోర్స్‌ స్కాం, హవాలా కుంభకోణం, ప్రియదర్శిని మహతో హత్యకేసు, నితారి వరుస హత్యలు, దావూద్‌ ఇబ్రహీం కేసు, మలాంక వర్గీస్‌ హత్యకేసు, సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌, సంత్‌సింగ్‌ చత్వాల్‌ కేసు, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రహసనం దాని ప్రతిష్టకే మచ్చతెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న 2జీ స్పెక్ట్రమ్‌ కేసు, బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణం తదితర కేసుల దర్యాప్తు అంతే ప్రహసనంగా సాగుతోంది. దీనికి తోడు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ఉసిగొల్పి కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు సరేసరి. ఈనేపథ్యంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సీబీఐకి జవసత్వాలు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఫలితాన్నిచ్చే దిశగా సాగుతున్నాయి. సుప్రీం ప్రస్తుత చర్యలు వినీత్‌ నారాయణ్‌ తీర్పు మాదిరిగానే నీరుగారితే ఇక కేంద్ర దర్యాప్తు సంస్థను బాగు చేసే దిక్కే ఉండదు. సుప్రీం చీవాట్లతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల కమిటీకి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం నేతృత్వం వహిస్తారని ప్రధాని పేర్కొన్నారు. కమిటీలో న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌, విదేశాంగ శాఖ మంత్రి సుల్మాన్‌ ఖుర్షీద్‌, ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ వి. నారాయణస్వామి సభ్యులుగా, సీబీఐ రంజిత్‌ సిన్హా ఆహ్వానితుడిగా కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా కలిసి సీబీఐకి స్వయం ప్రతిపత్తి ప్రసాదిస్తారో లేదో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.