సుందిళ్ల పనుల వేగం పెంచండి
– వారం రోజుల్లో సేఫ్ లెవల్‌కు గైడ్‌బండ్స్ పనులు పూర్తికావాలి
– భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు
– రెండోరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి
పెద్దపల్లి, ఆగస్టు8(జనం సాక్షి) : సుందిళ్ల పనుల వేగం పెంచాలని అధికారులను, ప్రాజెక్టు ఇంజనీర్లను భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా మంత్రి హరీశ్ రావు పర్యటన బుధవారం రెండో రోజూ కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా సుందిళ్ల బ్యారేజ్ పనులను మంత్రి పరిశీలించారు. బ్యారేజ్ సైట్ వద్దకు ఇంజినీర్లతో కలిసి వెళ్లిన హరీశ్ రావు.. పనులు జరుగుతున్న తీరును గమనించారు. బ్యారేజ్ పనులు, గేట్ల బిగింపు, గైడ్ బండ్స్ పనులతో పాటు వింగ్ వాల్స్ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఇంజినీర్లు, గుత్తేదారులతో మంత్రి హరీశ్ రావు సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సుందిళ్ల బ్యారేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను, గుత్తేదార్లను ఆదేశించారు. సుందిళ్ల బ్యారేజ్ లెఫ్ట్, రైట్ బండ్స్ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. వారం రోజుల్లో సేఫ్ లెవల్‌కు గైడ్ బండ్స్ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా ఒక టీఎంసీ నీటిని నింపినా గైడ్ బండ్స్ పనులు పూర్తి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 74 గేట్లకు గానూ 41 గేట్లు బిగింపు పూర్తయ్యాయని ఇంజినీర్లు తెలిపారు. 3 గేట్ల బిగింపు పూర్తి కానున్నాయి. గేట్ల బిగింపు పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. 200 మంది కూలీలను పెంచాలని గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. ఇంజినీర్లు, గుత్తేదార్లు సైట్ వద్ద రాత్రింబవళ్లు ఉండి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మంత్రి సూచించారు.