సెప్టెంబరు 17 వాళ్లిద్దరికీ సంబంధంలేదు

– ఎంఐఎం, బీజేపీపి మత రాజకీయాలు

– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణ విలీన దినోత్సవం విషయంలో భాజపా, ఎంఐఎం పార్టీలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌ సంస్థానం విలీనంలోనూ కాంగ్రెస్‌ పార్టీకే సంబంధం ఉందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 17వ తేదీకి, ఆరెండు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పెత్తనం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు ఐకమత్యంతో పనిచేసి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేలా కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ముఖ్య నాయకులు మర్రి శశిధర్‌ రెడ్డి, కుమార్‌ రావ్‌, ప్రేమ్‌ లాల్‌, బొల్లు కిషన్‌, ఉజ్మా షకీర్‌ తదితరులు పాల్గొన్నారు.