సోమరుల ఆటలో అవినీతి జాడలు
కికెట్.. భారత్‌లో ఒక మతం. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే మారుమూల పల్లెలు మొదలు కాస్మోపాలిటన్ నగరాల వరకూ టీవీలకు అతుక్కుపోతాయి. స్వదేశంలో టోర్నీ ఉండి ఏ నగరంలోనైతే మ్యాచ్ ఉంటుందో అక్కడ అప్రకటిత సెలవే. ప్రజలు అన్ని పనులూ వదులుకొని క్రికెట్టే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తారు. అంతలా ప్రజలను క్రికెట్‌కు బానిసలు చేసింది బ్రిటిషర్లే. వలస పాలనతో పాటు మనదేశానికి క్రికెట్‌ను తీసుకొచ్చి ఇక్కడే వదిలేసి వెళ్లారు ఇంగ్లిషోల్లు. ఆ రోజుల్లో క్రికెట్‌ను జంటిల్మన్ గేమ్ అనేవాళ్లు. కానీ అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ మాత్రం క్రికెట్‌ను పిచ్చోళ్ల ఆటగా అభివర్ణించేవారు. 11 మంది పిచ్చోళ్లు ఆడుతుంటే 11 వేల మంది పిచ్చోళ్లు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆడేవాళ్లు పిచ్చోళ్లు కాదు.. చూసే ప్రేక్షకులు మాత్రమే పిచ్చోళ్లు. ప్రపంచీకరణ తెచ్చిన ఫాస్టెస్ట్ ట్వంటీ ఫలితంగా క్రికెట్ అభిమానం వెర్రితలలు వేసింది. ఒక్క అభివృద్ధి చెందిన దేశంలోనూ లేని క్రికెట్‌కు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఆధరణ ఎక్కువగా ఉంది. ఒక్కప్పుడు లండన్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) ప్రధాన కార్యాలయం కొన్ని దశాబ్దాల క్రితమే దుబయికి మార్చారు. పేదదేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ క్రికెట్లో మాత్రం అగ్రదేశమే. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. క్రికెట్‌లో క్లాస్‌గేమ్‌గా పేరున్న టెస్టులకు కాలక్రమేణ ఆధరణ తగ్గుతోంది. ఒకప్పుడు 60-60 ఓవర్ల మ్యాచ్‌గా ఉన్న వన్డే ఫార్మాట్‌లోనూ మార్పులు వచ్చాయి. మొదట మ్యాచ్ ఓవర్లు ఒక్కో ఇన్నింగ్స్‌కు 50కి పరిమితం చేశారు. వన్డేలను మరింత వ్యాపారాత్మకంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు మొదట్లో 15 ఓవర్ల ఫీల్డింగ్ నిబంధనలు, ఇప్పుడు పవర్ ప్లేలు ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం, లేదా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే వన్డే ఫార్మాట్ కూడా కాస్త బోర్ కొట్టడంతో పొట్టి క్రికెట్ ఫార్మాట్‌కు తెరతీశారు. కేవలం మూడు గంటల్లోనే ముగిసే టీ-20 ఫార్మట్ ప్రవేశంతోనే క్రికెట్‌లో ఉన్న కొద్దిపాటి క్రీడా విలువలు పతనమయ్యాయి. క్రికెట్‌కు టెన్నిస్, ఫుట్‌బాల్ తరహాలో గ్లామర్ తెచ్చేందుకు ఐసీసీ, బీసీసీఐ పెద్ద ప్రయత్నాలే సాగించాయి. బీసీసీఐ ఇంకో అడుగు ముందుకేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తెరతీసింది. ఆరేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఐపీఎల్‌లో ఆదినుంచి వివాదాలే. క్రికెటర్లను అంగట్లో సరుకుల్లా వేలం వేసి అమ్మకానికి పెట్టారు. అన్ని జాతీయ జట్లలోనూ ఐపీఎల్ చీలిక తెచ్చింది. ఒకప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సహచరులు ప్రత్యర్థులుగా మారి మైదానంలోనే పొట్లాటకు దిగిన సందర్భాలు క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ తెచ్చిపెట్టాయి. క్రికెట్ గ్లామర్, కరెన్సీ గేమ్‌గా మారిన తర్వాత, కోట్లాది మంది అభిమానుల్ని కూడగట్టుకున్న తర్వాత అనేక పెడధోరణులు పొడసూపాయి. 1990వ దశకంలో వన్డే క్రికెట్‌లో వెలుగు చూసిన ఫిక్సింగ్ భూతం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, భవిష్యత్ కెప్టెన్‌గా పేరుగాంచిన అజయ్ జడేజా, దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించిన కెప్టెన్ హన్సీ క్రోనే కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికాయి. క్రికెట్ బెట్టింగ్ భూతం ఆనుపానులు బయట పడుతాయనే క్రోనేను విమాన ప్రమాద రూపంలో బలిగొన్నారనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. క్రోనే హత్యతో ఫిక్సింగ్ భూతం మూలాలు బయల్పడకుండా పోయాయనే అనుమానాలున్నాయి. వన్‌డే ఫార్మాట్‌లో అప్పుడప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న దుబయి కేంద్రంగానే ఫిక్సింగ్ రాకెట్ రాజ్యమేలుతుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చేతిలోని నెట్‌వర్క్ దీనిని ఆపరేట్ చేస్తున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క దావూదే కాదు ఆయనలాంటి ఎందరో అండర్‌వరల్డ్ మాఫియా డాన్లు క్రికెట్‌లో బెట్టింగ్‌ను పెంచిపోషిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ భాగోతం క్రికెట్‌కు మాయని మచ్చనే తెచ్చిపెట్టింది. అసలే సోమరుల ఆటగా పేరున్న క్రికెట్‌ను అండర్ వరల్డ్ గేమ్‌గా మార్చేసింది. భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మళయాలీ క్రికెటర్ శాంతాకుమరన్ శ్రీశాంత్ ఈ ఫిక్సింగ్ భూతంతో అత్యంత దగ్గరి సంబంధాలు నెరిపినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మైదానంలోంచి సైగల ద్వారా బుకీలతో సంప్రదిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఒక్కో ఓవర్‌లో 20కి పరుగులిచ్చే బౌలర్‌కు రూ.60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తేలడంతో అసలు క్రికెట్ ఎటుపోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ సోమరుల ఆటగానే గుర్తిస్తున్నాయి. వారు ఫుట్‌బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. చైనా, జపాన్ తదితర దేశాలు క్రికెట్‌ను పట్టించుకున్నపాపాన పోలేదు. ఆయా దేశాల్లో యుద్ధ క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యత స్థాయిలోనే మనదగ్గర క్రికెట్‌ను ఆరాధిస్తున్నారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అంతా సొమ్ము చేసుకుంటున్నారు. యావత్ భారతాన్ని తనకు బాసినగా మార్చుకున్న క్రికెట్ ఇప్పుడు అనేక అక్రమాలకు నిలయం. ఇలాంటి ఆటకోసం రోజుల తరబడి వృథా చేసేందుకు ఇంకా యువత, ప్రజలు సిద్ధంగా ఉండటం విచారకరం. ఏదైన ఆటను ఆటగా చూడాలి. ఆటగానే ఆడాలి. క్రీడాస్ఫూర్తిని వందపాళ్లూ ప్రదర్శించాలి. ఇవన్ని లోపించిన క్రికెట్‌ను ఎలా ఆటగా గుర్తించాలో.. దీన్ని దారిలో పెట్టేందుకు భారత క్రీడామంత్రిత్వ శాఖ, బీసీసీఐ ఎలాంటి చర్యలు చేపడుతాయో వేచి చూడాలి.