స్వచ్చత కోసం కార్యాచరణ

ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమాలకు రూపకల్పన

కరీంనగర్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): స్వచ్ఛభారత్‌లాంటి కార్యక్రమా లు అమలైనా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఆగస్టు 15నుంచే మూడు నెలల పాటు పల్లెల్లో పారిశుధ్యం కోసం కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి నెలంతా పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలు, చైతన్య కార్యక్రమాలు చేపడతారు. తర్వాత రెండు నెలల్లో పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించారు. పల్లెల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం కోసం చేపట్టాల్సిన పలు అంశాలపై అధికారులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. గ్రామాల్లో గుంతలు, పాడుబడ్డ బావులు ఉంటే తక్షణమే పూడ్చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇక కూలిన ఇండ్లు, శిథిలమైన భవనాలు, కట్టడాలను తొలగించడం, పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లు తదితర పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. మురుగు కాలువల్లో పూడిక తీసి అన్ని కాలువలనూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు కాలువలను తీర్చిదిద్దాలి. అంతర్గత రోడ్లపై గుంతలు ఉంటే పూడ్చివేయాలి. వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలి. గుంతల్లో మొరం పోయాలి. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, కృష్ణ తులసీ మొక్కలు పెంచాలి. గ్రామంలో ఉత్పత్తయ్యే చెత్తను వేసేందుకు సరిపడా డంప్‌యార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గ్రామంలో శ్మశానవాటిక ఉండాలి. గ్రామస్తులను చైతన్యపరిచి వారానికి ఒకసారి శ్రమదానంలో భాగస్వాములను చేయాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపెద్దలతో సమావేశాలు నిర్వహించి రోజూ ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే పల్లె జనం వ్యాధులతో దవాఖానల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన దుస్థితి. వీటిన్నింటికీ స్వస్తి పలికి పల్లెలను స్వచ్ఛపల్లెలుగా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఊర్లు శుభ్రంగా ఉంటే నే జనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని భావించి, గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం పంద్రాగస్టు నుంచే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పొలం గట్లు, బావుల వద్ద మొక్కలు పెంచుకునేలా రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామ సవిూపంలో ఖాళీ స్థలాలు, అడవులు ఉంటే వాటిలో మొక్కలు నాటడంపై దృష్టి సారించాలి. ప్రభత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలతో పాటు కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు కృషి చేయాలి. ఇళ్ల ఆవరణల్లో మొక్కలు పెంచుకునేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలి. ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యేకాధికారితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, యువజన సంఘాల, మహిళాసంఘాల సభ్యులు సంయుక్తంగా నిర్వహించి స్వచ్ఛపల్లెగా తీర్చిదిద్దాలి.