హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి
నిజామాబాద్,జూన్15(జనంసాక్షి): హరితహారం కింద మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పచ్చదనంతో పకృతిని కాపాడాలని అన్నారు. జిల్లాలో అత్యధికంగా మొక్కలుపెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇందులో ప్రథమంగా నిలిస్తే మంచిదని సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలు దీనిని సవాలుగా తీసుకుని సిఎం కెసిఆర్ ఆశయాన్ని నెరనవేర్చాలని అన్నారు. పచ్చదనం తగ్గిపోవడంతోనే వర్షపాతం కూడా తక్కువ స్థాయికి పడిపోయిందని అన్నారు. అడవులుంటేనే 1వాతావరణం సమతుల్యంగా ఉంటుందని, అందుకే ఇంటింటా, వాడవాడలా మొక్కలను పెంచాలని సూచించారు. దీనిని ఉద్యమంగా తీసుకుని వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దీనిని చేపట్టాలన్నారు. లేకుంటే భవిష్యత్ తరాలు మనలను క్షమించవన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కల చొప్పున 10 నియోజకర్గాల్లో కలిపి మొత్తం 4 కోట్ల మొక్కలను నాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వర్షపునీటి సంరక్షణ కూడా చేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.