హైదరాబాద్‌తో అబ్దుల్‌ కలాం బంధం విడదీయలేనిది

C
– దేశ కీర్తి కిరీటంలో ఆయన కలికితురాయి

– డీఆర్‌డీఏకు కలాం పేరు ప్రతిపాదించాలి

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

– తెలంగాణ శాసనసభ ఘననివాళి

హైదరాబాద్‌్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, పిఎసి ఛైర్మన్‌ కిష్టారెడ్డిలకు తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం  ప్రారంభమయ్యాయి. శాసనసభలో సభాపతి మధుసూదనాచారి, శాసనమండలిలో ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ల ఆధ్వర్యంలో సభా సమావేశాలు వీరిద్దరికి ఘనంగా నివాళి అర్పించిన తరవాత వాయిదా పడ్డాయి.  అసెంబ్లీలో  జాతీయగీతాలపన అనంతరం స్పీకర్‌ అనుమతితో సీఎం కేసీఆర్‌ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతిపట్ల సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులర్పించారు. హైదరాబాద్‌ నగరంలోని డీఆర్‌డీఓకు మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌ కలాం పేరు పెట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.  సీఎం కేసీఆర్‌ కలాం మృతి పట్ల సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలాం మరణం దేశానికి, రక్షణ రంగానికి తీరని లోటని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలకు చేరిన కలాం దేశానికే గర్వకారణమన్నారు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కలాం అని కేసీఆర్‌ కొనియాడారు. హైదరాబాద్‌తోనూ ఆయనకు అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. కలాంకు నివాళిగా హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌కు ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నట్లు తెలిపారు. కలాం మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. దేశ కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చేందుకు కలాం కృషి చేశారు. అధ్యాపకుడిగా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం ఎనలేని సేవచేశారని సీఎం పేర్కొన్నారు. కలాంతో తమ అనుబంధాలను పలువురు సభ్యులు గుర్తుచేసుకున్న తర్వాత సంతాప తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. అనంతరం కలాం మృతికి సంతాపంగా సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన మ¬న్నత వ్యక్తి అబ్దుల్‌ కలాం అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ నివాళి అర్పించారు. దివగంత అబ్దుల్‌ కలాం మృతిపట్ల ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంపై ఈటల మాట్లాడుతూ.. కలాం మృతి దేశానికి తీరనిలోటన్నారు.  మంచి రచయితగా, అధ్యాపకుడిగా దేశానికి సేవలందించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే దిశానిర్దేశం చేయాలని అబ్దుల్‌ కలాం సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కెజి టూ పిజి విద్యకు తమకు కలాం స్ఫూర్తి అని అన్నారు. శాస్త్ర విజ్ఞానంలోనే కాదు.. మానవతా దృక్పథంలో కలాం జీవితం స్ఫూర్తిదాయకమని విపక్షనేత, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కుందూరు జానారెడ్డి అన్నారు. కలాం గొప్పదనాన్ని మాటల్లో చెప్పలేం. దేశరక్షణ కోసం కలాం ఎంతో కృషి చేశారు. కలాం ఆలోచన విధానాన్ని భారతజాతి అనుసరించాలని ఆయన పేర్కొన్నారు.అబ్దుల్‌ కలాం గొప్ప శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగానూ దేశానికి అత్యున్నత సేవలు అందించారని తెలంగాణ అన్నారు. దేశ రక్షణ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శాష్ట్రవేత్తగానే కాకుండా… గొప్ప మానవతావాదిగా ప్రజల గుండెల్లో కలాం చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ టిడిపి శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కలాం మృతి దేశానికి తీరని లోటన్నారు. డీఆర్‌డీఎల్‌కు కలాం పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించడం మంచి నిర్ణయమని కొనియాడారు. కలాం రాష్ట్రపతి కావడానికి ఒక విధంగా తమ నాయకుడు చంద్రబాబు కారణమని ఎర్రబెల్లి అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం పేరును సూచించింది చంద్రబాబేనని ఎర్రబెల్లి గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గొప్ప మానవతావాది అని బిజెపి  శాసనసభాపక్ష నేత డా.లక్ష్మణ్‌ అన్నారు. కలాం తన ప్రసంగాల ద్వారా యువతకు దిశానిర్దేశర చేశారని కొనియాడారు. కలాం స్ఫూర్తితో యువత ముందుకు సాగి దేశానికి సేవలు చేయాలని ఆకాంక్షించారు. చివరి క్షణాల వరకు దేశం కోసమే ఆలోచించిన మహనీయుడు కలాం అని లక్ష్మణ్‌ అన్నారు. కలాం జీవితం అంతా యువతకు స్పూర్తినిచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కలాం తన ప్రసంగాల ద్వారా యువతకు దిశానిర్దేశం చేశారు. అబ్దుల్‌ కలాం మ్యాన్‌ ఆఫ్‌ మిసైల్‌గా ప్రఖ్యాతి గాంచారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారని తెలిపారు.చివరి వరకు విద్యార్థులతోనే గడిపి హఠాన్మరణం చెందడం బాధాకరమన్నారు. అబ్దుల్‌ కలాం తన జీవితం ద్వారా దేశానికి దిశానిర్దేశర చేశారని ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి అన్నారు. కలాంతో హైదరాబాద్‌కు ఎనలేని సంబంధం ఉందన్నారు.రాష్ట్రపతి ¬దాలో పనిచేసి కూడా సాధారణ జీవితం గడపటం ఆయనకే చెల్లిందన్నారు. స్వామి వివేకానంద తర్వాత యువతను విశేషంగా ఆకర్షించిన మహనీయుడు అబ్దుల్‌ కలాం అని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కలాం చేసిన పరిశోధనల వల్లే దేశం రక్షణ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరిందని కొనియాడారు. అణుశక్తి పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు భారత్‌పై ఉన్న చిన్నచూపు తొలగించారని అన్నారు. విద్యార్థులంటే కలాంకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌కు కలాం పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కలాం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.