1, 5 రూపాయలకే భోజనాలొస్తే ఎంపీలకు రూ.80 వేల జీతమెందుకు?


– ప్రధానిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి
– అన్నా హజారే
గోండా, (జనంసాక్షి) :
రూపాయి, ఐదు రూపాయలు, 12 రూపాయలకే భోజనం లభిస్తే ఎంపీలకు రూ.80 వేల జీతమెందుకని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఆయన ఆదివారం పర్యటించారు. అంత తక్కువ మొత్తానికి భోజనం లభించేటట్టు అయితే ఎంపీలకు అంత వేతనాలు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేయడమెందుకని ప్రశ్నించారు. ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పాలకులు పేదరికంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రిని దేశ ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం కలిగితే మంచి వ్యక్తులు పాలకులుగా వచ్చే అవకాశముందన్నారు. ప్రధానిని నేరుగా ఎన్నుకుంటేనే దేశానికి మంచి జరుగుతుందన్నారు. అవినీతి రహిత దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.