10 నుంచి చెక్కుల పంపిణీ

సిఎం కెసిఆర్‌ రాకతో జిల్లాలో హడావిడి
జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్‌,మే7(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. సిఎం కెసిఆర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనుండడంతో  జిల్లాలో హడావిడి మొదలయ్యింది.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, అధికార యంత్రాంగం రోజువారీగా సవిూక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాలకు వెళ్తూ స్థానిక రైతులు, అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతుకు ముందస్తు పెట్టుబడి కింద సాయం అందజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం అమలులో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చర్యలు తీసుకోవాలని తగు సలహాలు సూచనలు చేస్తున్నారు.   తెలంగాణ ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి సుముహూర్తం ఖరారు చేసింది. గతంలో ఎన్నడూ ఎవరూ కనీవినీ ఎరుగని విధంగా పంటలకు ముందస్తు పెట్టుబడి సాయం అందజేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించిన సర్కార్‌ పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి ఎకరాకు రూ. 4 వేలు రెండు పంటలకు గానూ ఏడాదికి రూ. 8 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులను గుర్తించి వారికి చెక్కు రూపంలో పంట సాయం అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఇటీవల భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతమైన దృష్ట్యా చెక్కులతో పాటు పట్టా పాస్‌పుస్తకాలు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 10 నుంచి చెక్కులు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. చెక్కుల పంపిణీకి గానూ ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ 300చెక్కులకు నలుగురు సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా మండలాలు, గ్రామాల వారీగా ఎంపిక చేసిన టీంలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీస్‌ యంత్రాంగం ఏర్పాట్లు చేపడుతోంది. ఇప్పటికే పోలీస్‌ అధికారులు ఆయా గ్రామాలను సందర్శిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెక్కులు చేరుకోగా పోలీస్‌ యంత్రాంగం వారి ఆధీనంలోకి తీసుకుని భద్రపరిచింది.